01-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జూన్ 1: విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం అదుపులోకి రాలేదు. అతిసార లక్షణాలతో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరుకుంది. మొగల్రాజుపురంలో గల్లా కోటేశ్వరరావు(60) అనే వృద్ధుడు వాంతులు, విరేచనాలతో మృతి చెందాడు. ఇప్పటికే డయేరియా లక్షణాలతో మొగల్రాజపురం, పాయకాపురంలో ఎనిమిది మంది మృతి చెందారు. విజయవాడ నగరంలో గత ఐదు రోజుల్లో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. ఒక్క మొగల్రాజపురంలోనే ఇప్పటివరకు ఆరుగురు విరేచనాలతో మృతి చెందారు. పాయకాపురం, అజిత్సింగ్ నగర్ ప్రాంతాల్లో వారం వ్యవధిలో ఇద్దరు మహిళలు, ఒక బాలుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంత తీవ్రత ఉన్నా.. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక శిబిరాలు పెట్టలేదు. మొగల్రాజపురంలోని సీపీఎం కార్యాలయంలో ఆరు పడకలను ఏర్పాటుచేసి వారి సౌజన్యంతో చికిత్స అందిస్తోంది. దాదాపు 250 మంది రక్తనమూనాలు సేకరించామని చెబుతున్నా.. ఇంతవరకు ఒక్కదాని ఫలితమూ ప్రకటించలేదు.
నగరంలో డయేరియా మరణాలు ఆందోళనకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని కోరారు. కలుషిత నీటితో ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదన్నారు. కలుషిత నీటి గురించి ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.