01-06-2024 RJ
తెలంగాణ
న్యూఢిల్లీ, జూన్ 1: తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్‌ను తొలగించాలని అప్పుడు, ఇప్పుడు తమ పార్టీ పోరాడుతునే ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపం ఉండటం మంచిదని.. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరి అభిప్రాయం తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ వేదికగా శుక్రవారం బండి సంజయ్ విూడియాతో మాట్లాడుతూ... ఉద్యమంలో అసువులు బాసిన అమరులు, ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలిపారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీని తెలంగాణ ఉత్సవాలకు ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకులకు ఎందుకు ఆహ్వానం ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఇచ్చిన మాట సోనియా వెనక్కి తీసుకోవడం వల్లే ఆత్మహత్యలు జరిగాయన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ను వెతికి మరి ఆహ్వానం ఇచ్చి ప్రేమ ఒలకబోసిన రేవంత్‌కు , తెలంగాణకు మద్దతిచ్చిన బీజేపీని ఎందుకు వేడుకలకు పిలవడం లేదని నిలదీశారు. సోనియా, కేసీఆర్ ఒకే వేదిక పంచుకునేలా రేవంత్ ఎత్తుగడ వేశారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌లో బయటపడేందుకు కేసీఆర్ , కాంగ్రెస్‌ను అన్ని రకాలా లోబరుచుకున్నారని ఆరోపించారు. ఈ కేసు విషయంలో కేసీఆర్‌కి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో అధికారులు కేసీఆర్ పేరు చెప్పారని.. మరీ ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. కాళేశ్వరం కేసు, ఫోన్ ట్యాపింగ్?పై రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
అందుకే ఈ కేసుల దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కేంద్రం దర్యాప్తు చేస్తే, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఎలా జరిగిందో చూశారని అన్నారు. ఏఐసీసీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారిందని విమర్శించారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలను నిర్వీర్యం చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హావిూలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో అందరి బతుకులను కేసీఆర్ నిర్వీర్యం చేశారని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.