01-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 1: నూతన తెలంగాణ పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ శాసన సభాపక్ష నేత కూనమనేని సాంబశివరావు వెల్లడించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమా..? పేద రాష్ట్రమా అనేది అర్థం కావటం లేదన్నారు. తెలంగాణలో ఏ రంగం కూడా సంతృప్తిగా లేదన్నారు. సింగరేణి మాజీ సీఎండీ శ్రీధర్ వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. సింగరేణి పదేళ్ల కుంభకోణాలపై విచారణ చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఇల్లందు గెస్ట్ హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ రంగం, ఇరిగేషన్ రంగంలో కూడా పూర్తిగా వైఫల్యాలు ఉన్నాయన్నారు. ఉద్యోగ కల్పన, రైతాంగం, వ్యవసాయంపై, అభివృద్ధిపై ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. కేసీఆర్ ఓడిపోయి అదృష్టవంతు డైనాడని, వీరిపాపాలు నేడు కాంగ్రెస్ మోస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై మా నిరంతర పోరాటం ఆగదన్నారు.
తెలంగాణ గీతంపై, రాష్ట్ర చిహ్నంపై బీఆర్‌ఎస్ తీరు ఆక్షేపనీయమని, ఇలాంటి వాటిపై కాకుండా ప్రజా సమ్యసలపై దృష్టిపెట్టాలన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ బతికుండాలని ఆయన పేర్కొన్నారు. తప్పుడు పద్దతుల్లో మత విద్వేశాలు రెచ్చగొడుతున్న బీజేపీ దేశ అభివృద్ధి పూర్తిగా విఫలం అయిందని తీవ్రంగా విమర్శించారు. బీజేపీ రాజ్యాంగానికి భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీకి తెలంగాణలో స్థానం ఉండకూడదంటే బీఆర్‌ఎస్ బతకాలన్నారు. కాంగ్రెస్ గెలుపు కమ్యూనిస్టుల ద్వారానే సాధ్యమన్నారు. డబ్బులతో పని లేని ఎన్నికల కోసం పోరాటాలు చేస్తామన్నారు. ప్రజల కోసం పుట్టిందే కమ్యూనిస్టు పార్టీ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.