02-06-2024 RJ
తెలంగాణ
మహబూబ్‌నగర్, జూన్ 2: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భారాస విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై భారాస అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి 109 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు సమాచారం. మార్చి 28న పోలింగ్ నిర్వహించగా.. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించారు. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా.. 1,437 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ కోసం మొత్తం ఐదు టేబుళ్లు ఏర్పాటు చేశారు.
1437 ఓట్లలో 21 చెల్లనివిగా గుర్తించారు. మిగిలిన 1416 ఓట్లలో నవీన్‌కుమార్‌రెడ్డికి 762, మన్నె జీవన్‌రెడ్డికి 653, స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు వచ్చాయి. భారాస అభ్యర్థి విజయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.