02-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 2: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత భారాసలో ఎవరూ ఉండరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారాస అధినేత కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదన్నారు. మంత్రి పదవి రాలేదనే కారణంతోనే అప్పట్లో తెలంగాణ ఉద్యమం చేపట్టారని, అమాయకులను రెచ్చగొట్టారని విమర్శించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో భోజనం చేయాలంటే రూ.లక్ష వసూలు చేసేవారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలంతా సోనియాగాంధీకి రుణపడి ఉండాలని చెప్పిన కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆమె కాళ్లు మొక్కారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్.. చేపలు, గొర్రెల పంపిణీ పేరిట రూ.వేల కోట్లు తిన్నారు.
ప్రపంచంలో వింత అని చెప్పిన మేడిగడ్డ మూడేళ్లలో కూలిపోయింది. మేడిగడ్డకు మరమ్మతులు చేసినా గ్యారంటీలేదని ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇచ్చింది. భారాస చేసిన రైతు రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. వందల ఎకరాలు ఉన్నవారికి కూడా రైతుబంధు వేశారు. 70 వేల మంది టీచర్లు రిటైర్ అయినా డీఎస్సీ నిర్వహించలేదు‘ అని కోమటిరెడ్డి విమర్శించారు. కానీ తాము అలా కాకుండా పంద్రాగస్టుకు రూ.2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని పునరుద్ఘాటించారు. ఇకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిబయటపెట్టారు. ఈ కేసు విషయంలో అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో మాజీ మంత్రి హరీష్‌రావు దొంగచాటుగా గత సీఎండీ ప్రభాకర్ రావును అమెరికా వెళ్లి కలిసి వచ్చారని ఆరోపించారు.
మే 26న ఎమిరేట్స్ విమానంలో హరీష్‌రావును కేసీఆర్ అమెరికా పంపారని విమర్శించారు. గత సీఎండీ ప్రభాకర్‌కి ఎప్పుడు ఫోన్ చేసినా హాస్పిటల్లో ఉన్నానని చెప్పేవాడన్నారు. అసెంబ్లీకి వచ్చే మొహం కేసీఆర్‌కి లేదన్నారు. అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలవలేదని ప్రమాణం చేయడానికి హరీష్ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్లాల్సిన అవసరం హరీష్‌రావుకి ఏమోచ్చిందని నిలదీశారు. ఎన్ని రోజులైనా కేసీఆర్‌ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ప్రభాకర్ రావును వెంటనే వచ్చి పోలీసులకు లొంగిపోవాలని కేసీఆర్ చెప్పాలన్నారు. కేసీఆర్ కూడా తన తప్పు ఒప్పుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావును కలవడానికే హరీష్ అమెరికా వెళ్లారని ఆరోపణలు చేశారు.
మంత్రి కోమటిరెడ్డి నివాసంలో ఆదివారం విూడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.... ప్రభాకర్ రావు ఇండియాకు రాకుండా ఆపేందుకే హరీష్ అమెరికా వెళ్లారన్నారు. ట్యాపింగ్ చేస్తూ భార్యాభర్తల ఫోన్లు కూడా విన్నారని... ప్రభాకర్ రావు అప్రూవర్‌గా మారితే ఇబ్బంది అవుతుందని కేసీఆర్ భయపడు తున్నారన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదని చెప్పారు. తెలంగాణ జిన్నా లాగా కేసీఆర్ మారారని ఎద్దేవా చేశారు. జిన్నా కూడా ఒకరోజు ముందే స్వాతంత్య దినోత్సవాన్ని చేసుకునే వారని సెటైర్లు గుప్పించారు. కేసీఆర్ కూడా ఒకరోజు ముందే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నారని విమర్శించారు. రాక్షస పాలన పోయిందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారన్నారు.
మంత్రి పదవి రానందుకే కేసీఆర్ తెలంగాణ వాదం ఎత్తుకున్నారని దెప్పిపొడిచారు. ఉద్యమంలో కేసీఆర్ కోట్ల రూపాయలు వసూలు చేశారని విమర్శలు గుప్పించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ రాజీనామాలు చేసింది కలెక్షన్ల కోసమేనని విమర్శించారు. ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పాలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఒక్క డీఏస్సీ కూడా ప్రకటించలేదని అన్నారు. జగన్ చేసిన మోసంతో కేసీఆర్ తెలంగాణను ఎండబెట్టారని ఆరోపణలు చేశారు. వరి వేస్తే ఉరే అని రైతులకు చెప్పి కేసీఆర్ మాత్రం వరి వేసుకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.