02-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 2: రాజధాని హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. అప్పటి వరకు ఎండతో మండిపోయిన నగరంలో వాతావరణం చల్లబడిరది. మేఘావృతమైన వర్ష సూచన కనిపిస్తోంది. ఉరుములు మెరుపులతో పలు చోట్ల వర్షం పడింది. భాగ్యనగరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. నల్లటి దట్టమైన మేఘాలు నగర వ్యాప్తంగా ముసురుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన చేసింది. నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, ఆయా విభాగాల సిబ్బంది క్షేత్రస్థాయిలో అలర్ట్‌గా ఉన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలకుండగా, రోడ్లపై నీళ్లు నిలిచిపోకుండా.. చెట్లు, హోర్డింగ్స్ కూలిపోతే వెంటనే తొలగించేలా అధికారులు సమాయత్తం అయ్యారు.
మరోవైపు టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రజలు తమ తమ ప్రాంతాల్లో ఏమైనా సమస్యలుంటే వెంటనే ఈ నెంబర్లకు కాల్ చేసి సమాచారం తెలియజేయాల్సిందిగా అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో తొలకరి పలకరించింది. బజార్ హత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ తదితర మండలాల్లో వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో ఒక్క సారిగా వాతావరణం మారింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. మందమర్రి, ధర్మపురి, కమలాపూర్, కరీంనగర్, చెన్నూరు, పెద్దపల్లి, సిర్పూర్, కాగజ్‌నగర్, షాద్‌నగర్, మోత్కూరు, వలిగొండ, భువనగిరి సహా హైదరాబాద్‌లోని ఉప్పల్, రామంతాపూర్, చిలుకానగర్, బోడుప్పల్, పిర్జాదీగూడ, మేడిపల్లిలో భారీ వర్షకురుస్తోంది.