02-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 2: తాను అమెరికాలో విశ్రాంత ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావును కలిసినట్టు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తానని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ‘నేను.. అమెరికా వెళ్లి విశ్రాంత ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావును కలిసినట్టు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయడానికి సిద్ధం. రుజువు చేయకపోతే మంత్రి కోమటిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చెప్పడానికి కోమటిరెడ్డి ఆరోపణ ఒక ఉదాహరణ. నేను కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లింది వాస్తవం. కానీ, అమెరికా వెళ్లినట్టు, ప్రభాకర్‌రావును కలిసినట్టు మంత్రి మాట్లాడారు. ఏ దేశం వెళ్లాను, ఏ హోటల్‌లో ఉన్నాను.. తదితర వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.
పాస్‌పోర్ట్ సహా ఇతర వివరాలు తీసుకొని బహిరంగ చర్చకు వస్తా, అందులో ఇమిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయి. కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి మాట్లాడటం చౌకబారుతనం అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మంత్రి కోమటిరెడ్డి ఆదివారం విూడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీశ్‌రావు దొంగచాటుగా అమెరికా వెళ్లి వచ్చారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్‌రావును కలవడానికే హరీశ్‌రావు అమెరికా వెళ్లారని, ఇండియా రాకుండా ఆపేందుకు కేసీఆర్ పంపించారని ధ్వజమెత్తారు. ప్రభాకర్‌రావు అప్రూవర్‌గా మారితే ఇబ్బంది అవుతుందని కేసీఆర్ భయపడుతున్నారని ఆరోపించారు.