02-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. ప్రాణత్యాగంతో కుటుంబ పెద్దను కోల్పోయిన కిష్టయ్య కుటుంబానికి నేనున్నానని ఆనాడే మాట ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన మాటను నిలుపుకుంటూ వస్తున్నారు. ఎంబీబీఎస్ చదివిన కిష్టయ్య కుమార్తె ప్రియాంక పీజీ వైద్య విద్య కోసం మరోసారి ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కానిస్టేబుల్ కిష్టయ్య కుమార్తెను గతంలో కేసీఆర్ ఎంబీబీఎస్ చదివించారు.
నాడు ఎంబీబీఎస్ పూర్తిచేసుకున్న కిష్టయ్య బిడ్డ ప్రియాంక ఇప్పుడు పీజీ చదువుతున్నది. అందుకు మెడికల్ కాలేజీలో కట్టాల్సిన ఫీజు కోసం అవసరమైన 24 లక్షల రూపాయల చెక్కును ఆదివారం నాడు హైదరాబాద్ నందినగర్‌లోని కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అందించారు. అనంతరం కిష్టయ్య కుటుంబంతో కలిసి భోజనం చేశారు. అమ్మను కష్టపెట్టకుండా చూసుకోండని కిష్టయ్య పిల్లలకు బాధ్యత గుర్తుచేశారు.