03-06-2024 RJ
తెలంగాణ
ఖమ్మం, జూన్ 3: పేదవారిని విస్మరించిన బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బిఆర్ఎస్ అభివృద్ది చేస్తే తాము దానిని నాశనం చేసాం అన్న విధంగా కెసిఆర్ తదితరులు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సీట్లు వచ్చే పరిస్థితి లేదని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హావిూ నెరవేరుస్తా మని మంత్రి అన్నారు. ఆయన సోమవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పర్యటించిన సందర్బంగా ఈ విషయం తెలిపారు. రూ. 22.5 వేల కోట్ల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని అన్నారు.
అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు పూర్తిచేస్తామన్నారు. గడచిన పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం పేదవారికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, కట్టినవి కూడా చేతికి ఇవ్వలేదని అన్నారు. అహంకారం, కల్లబొల్లి మాటలతో కాలాన్ని నెట్టుకొచ్చిందన్నారు. పేదలను బిఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించి.. ప్రయోజనాలు కలిగించలేదని అన్నారు. పేదవారి ప్రభుత్వం వచ్చిన తరువాత రోహిణి కార్తెలోనే వర్షాలు కురుస్తున్నాయని, అనేక కష్టాలు, నష్టాలు పడి తనను మంచి మెజారిటీతో గెలిపించారని, విూరిచ్చిన అవకాశంతోనే తాను ఈస్థాయిలో ఉన్నానని శ్రీనివాసరెడ్డి అన్నారు. నేలకొండపల్లి మండలం, కొత్త కొత్తూరులో ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో పాలేరు నుంచి అత్యధిక మెజారిటీ రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆనాడు ఎన్నికల సభలో ప్రజలు అడిగిన కోరికలు నెరవేరుస్తానని మాటిచ్చానని, విూరు అడిగిన న్యాయమైన కోరికలు తీరుస్తానని మంత్రి పొంగులేటి అన్నారు. రాబోయే ఏడాది లోపే పాలేరులోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గడిచిన పదేళ్లలో పేదవారికి ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదని, అర్హులైన వారికి ఆసరా పెన్షన్ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని స్పష్టం చేశారు. రూ. ఇరవై రెండున్నర వేల కోట్లు ఖర్చు పెట్టి ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తామన్నారు. ప్రధాన ప్రతి పక్షం కల్లబొల్లి మాటలు మాట్లాడితుందని ఈ సందర్భంగా బీఆర్ఎస్పై మంత్రి పొంగులేటి నిప్పులు చెరిగారు.