03-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం, జూన్ 3: ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలకు నేటి ఫలితాలతో మోక్షం లభించబోతోందని తెదేపా నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నంలో కనకమహాలక్ష్మి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో గంటా మాట్లాడారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫలితం రేపు రాబోతోంది. త్వరగా ఈ ప్రభుత్వాన్ని తరిమేయాలనే కసి ప్రజల్లో కనిపించింది. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ ఏకపక్షంగా కూటమిదే విజయం అని చెప్పాయి. ఓటేసేందుకు ఇతర రాష్ట్రాలర నుంచి కూడా బస్సులు, రైళ్లలో వచ్చారు. అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావడం ప్రజల నాడికి సంకేతం.
ఎగ్జిట్ పోల్స్‌కు మించి కూటమి ఘన విజయం సాధించబోతోంది. చంద్రబాబు నాయకత్వంలో రాష్టాన్రికి పునర్వైభవం రాబోతోంది. విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేస్తున్నాం. అల్లర్లు సృష్టించేవాల్ళెవరో ప్రజలకు తెలుసు. వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు. భీమిలితో పాటు రాష్ట్రంలోనూ గెలుపు కూటమిదే‘ అని గంటా ధీమా వ్యక్తం చేశారు.