03-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 3: మైలార్ దేవ్‌పల్లి బాబుల్ రెడ్డి నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. గోడకూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఉదయం 10 గంటల సమయంలో ఘటన చోటు చేసుకుంది. బీహార్, ఒడిశాకు చెందిన పలు కుటుంబాలు బాబుల్ రెడ్డి నగర్‌లో నివాసముంటున్నాయి. స్థానికంగా కంపెనీలో సదరు కార్మికులంతా పనిచేస్తున్నారు. ఆయా కుటుంబాలకు చెందిన చిన్నారులు ఇంటి ముందు ఆడుకుంటుండగా గోడ ఒక్కసారిగా కూలిపోయింది. కూలిన గోడ శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు కావడంతో.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందిన చిన్నారులు నూర్జాన్, ఆసిఫ్ పర్వీన్ గా గుర్తించారు. ప్రమాద సమాచారం తెలుసుకుని మైలార్ దేవుపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. శిథిరాల కింద చిక్కుకున్న చిన్నారులను వెలికి తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నాణ్యత లేకుండా నిర్మించిన గోడే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. రాత్రి కురిసిన చిన్న వర్షానికి గోడ తడిసి కూలిపోయింది. చిన్నారుల మృతితో వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.