03-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 3: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓట్లతోపాటు.. అసెంబ్లీ ఎన్నికల ఓట్లను సైతం మంగళవారం లెక్కించనున్నారు. అందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, కోవ్వూరు అసెంబ్లీ స్థానాలు ప్రకటన వెలువడనుంది. ఉదయం 8.00 గంటలకు ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభం కానుంది. అందులో భాగంగా తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం 8.30 గంటలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించనున్నారు. అయితే రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల నుంచి 2,387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే 25 లోక్‌సభ స్థానాల నుంచి 454 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి అత్యధికంగా 46 మంది అభ్యర్థులు బరిలో నిలువగా.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని చోడవరం అసెంబ్లీ స్థానం నుంచి కేవలం ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తున్నారు.
విశాఖ లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 33 మంది అభ్యర్థులు బరిలో దిగితే.. రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి కనిష్టంగా 12 మంది అభ్యర్థులు పోటికి దిగారు. అయితే తొలి ఫలితాలుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, కోవ్వూరు అసెంబ్లీ స్థానాలు ప్రకటన వెలువడనుంది. ఈ రెండు అసెంబ్లీ స్థానాల్లో 13 రౌండ్ల కౌంటింగ్‌తో పలితం వెల్లడికానుంది. అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రంప చోడవరం, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గాల్లో తుది ఫలితంగా వెలువడనుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 29 రౌండ్ల కౌంటింగ్‌తో తుది ఫలితంగా వెలువడనుంది. ఇక భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్ల కౌంటింగ్ జరగనుంది. దాంతో రాత్రి 9 గంటల లోపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు వెల్లడయ్యేలా చర్యలు చేపట్టినట్లు ఈసీ వెల్లడించింది.