03-06-2024 RJ
తెలంగాణ
నల్గొండ, జూన్ 3: నల్గొండ మున్సిపాలిటీలోని 11 వార్డు పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో అనుమానాప్పద స్థితిలో మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. వాటర్ ట్యాంకులో వాటర్ చెక్ చేయగా అందులో డెడ్ బాడీ ప్రత్యక్షమైంది. వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీశారు. హనుమాన్ నగర్‌కు చెందిన ఆవుల వంశీగా గుర్తించారు. అతడు పది రోజుల క్రితం నుంచి కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదైయింది. అయితే అతడు ఆత్మహత్య చేసుకున్నా డా? లేక ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడా అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, ఇదే నీళ్లను గత పది రోజులుగా మున్సిపాలిటీ ప్రజలు తాగుతున్నారు.
కలుషిత నీటిని 10 రోజుల నుంచి వాడామని తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, కొద్ది రోజుల క్రితం నాగార్జునసాగర్‌లో ఎండల తాకిడితో.. దాహం తీర్చుకోవడానికి ఒకదాని వెంట ఒకటి మినీ ట్యాంకులోకి దిగిన కోతులు అందులోనే ప్రాణాలొదిలిన వైనం బయటపడిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే నల్గొండ మున్సిపాలిటీలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకర్‌లో మృతదేహం లభించడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా నిప్పులు చెరిగారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని విమర్శించారు.
కోతల్లేని కరెంట్ ఇవ్వలేరు.. కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరు.. కోతులు పడి చనిపోయినా వాటర్ ట్యాంకులను పట్టించుకోరని కేటీఆర్ అన్నారు. చివరికి.. నల్గొండలోని నీటిట్యాంకులో పదిరోజులుగా శవం ఉన్నా నిద్రలేవరని మండిపడ్డారు. సాగర్ ఘటన స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే.. కాంగ్రెస్ సర్కారులో మళ్లీ అదే నిర్లక్ష్యం.. అదే నిర్లిప్తత.. కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కారిది ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిన గలీజు పాలన ఇది అని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ పథకంతో.. దశాబ్దాల తాగునీటి తండ్లాటను తీరిస్తే.. కనీసం నీటిట్యాంకుల నిర్వహణ కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వమిది అని విమర్శించారు. జలమే జగతికి మూలం అని గుర్తుంచుకోండి అని తెలిపారు. ఈ సర్కారు తీరు మారకపోతే? జనమే కాంగ్రెస్ ను తరిమికొట్టడం ఖాయమని స్పష్టం చేశారు.