03-06-2024 RJ
తెలంగాణ
సిద్దిపేట, జూన్ 3: రేవంత్ రెడ్డి సీఎం కావచ్చు.. కానీ ఎన్నటికీ ఉద్యమకారుడు కాలేడని బీఆర్‌ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహీగానే చరిత్రలో మిగిలిపోతాడే తప్ప.. ఏనాటికీ ఉద్యమకారుడు కాలేడని విమర్శించారు. ఉద్యమకారులన్న ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే హరీశ్‌రావు.. జెండా ఆవిష్కరించారు. అనంతరం హరీశ్‌రావు విూడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం స్వరాష్ట్ర పోరాటం చేశామని గుర్తు చేశారు.
ఎలాంటి ఆశలు లేకుండా, ఎలాంటి ఆకాంక్షలు లేకుండా, ప్రజల కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, దశాబ్దాల కలను నిజం చేయడం కోసం పనిచేసిన వారందరినీ గుర్తుచేసుకోవడమే ఈ దశాబ్ది ఉత్సవాల్లో నిజమైన పండగ అని హరీశ్‌రావు అన్నారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన జిల్లా నేతలను గౌరవించుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి నిర్ణయించడం హర్షనీయమని హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో ప్రతి ఒక్కరూ ఉద్యమకారులే అని.. ప్రతి ఒక్కరినీ సన్మానించుకోవాలని తెలిపారు. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష అని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో ఎక్కడా జై తెలంగాణ అని లేదని తెలిపారు.
బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన ప్రకటనల్లో జై తెలంగాణ.. జైజై తెలంగాణ అని కచ్చితంగా ఉండేదని గుర్తుచేశారు. ఆరోజు సమైక్య పాలనలో జై తెలంగాణ మాటను నిషేధించారని తెలిపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ పదం మాయమైందని విమర్శించారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ సోయిని ఖతం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ హక్కుల కోసం, ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్‌ఎస్ అని స్పష్టం చేశారు.