04-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 4: లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఘోర పరాభవం తప్పేలా లేదు. ఒక్కటంటే ఒక్క సీటులో కూడా గెలిచే అవకాశం కనిపించడం లేదు. మెదక్‌లో సైతం బిఆర్‌ఎస్ వెనకబడి పోయింది. ఈ సీటుపై ఉన్న ఆశలు కూడా గల్లంతయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు బీఆర్‌ఎస్ పార్టీ బోణి కొట్టలేదనే చెప్పాలి. తాజా ఓట్ల లెక్కింపు ప్రకారం బిజెపి, కాంగ్రెస్ 8 స్థానాల చొప్పున గెలుపుదిశగా ఉన్నాయి. ఎంఐఎం తన హైదరాబాద్ సీటును నిలుపుకోనుంది. ఎగ్జిట్ పోల్ చెప్పినట్లే తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటి కొనసాగుతుంది. మల్కాజ్ గిరి పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ సెంటర్ నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి వెళ్లిపోయారు.
దాదాపు లక్ష ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ముందున్నారు. దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న పార్లమెంట్ స్థానంగా మల్కాజ్ గిరి సీటుకు పేరుంది. ప్రజల తీర్పును స్వాగతిస్తున్నా అని లక్ష్మారెడ్డి విూడియాతో అన్నారు. ఇంకా ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాలే కానీ, ఈటల విజయం దాదాపు ఖరారైనట్టే అని ఆ పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ వారు ఏమైనా బిజెపి కి ఓటు వేశారా అని ఆయనను అడిగగా.. లేదు మా పార్టీ వారు మాకే ఓటు వేశారని సమాధానం ఇచ్చారు. పూర్తిగా ఇంకా ఎన్నికల కౌంటింగ్ కాలేదు కానీ బిజెపి ముందంజలో ఉంది అని అన్నారు. మా పార్టీ నాయకుడు సూచన మేరకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని అన్నారు. గతంలో ఈ సీటు నుంచి ప్రస్తు సిఎం రేవంత్ ప్రాతినిధ్యం వహించారు.