04-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 4: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు విస్పష్టమైన తీర్పును ప్రకటించారు. విపక్ష టిడిపికి సంపూర్ణ మెజార్టీ సాధించింది. దీంతో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టిడిపి రంగం సిద్దం చేసుకుంటోంది. ఇకపోతే అధికార వైకాపాను ప్రజలు ఈడ్చి అవతల పడేశారు. 175 అసెంబ్లీ సీట్లకు గాను తాజా సమాచారం మేరకు టిడిపి 136 సీట్లను గెల్చుకోబోతున్నది. ఇకపోతే పోటీచేసిన 21 స్థానాల్లో అఖండ విజయం సాధించి జనసేన చరిత్ర సృష్టించింది. బిజెపి 7 సీట్లను గెల్చుకుంది. దీంతో కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించగా వైకాపా పదిసీట్ల వద్దే ఆగిపోయింది. కుప్పంలో చంద్రబాబు, పులివెందులలో జగన్, పిఠాపురంలో పవన్‌కళ్యాణ్, తదితరులు విజయం సాధించారు.టిడిపి ప్రముఖులంతా విజయం సాధించారు. నేరుగా ప్రజలకు డబ్బుల పందేరం చేసి, విజయంపై ధీమాగా ఉన్న జగన్‌ను ప్రజలు ఓటుతో బుద్ది చెప్పారు.
అభివృద్దిని విస్మరించి, అప్పులు చేసి పంచడమే అభివృద్ది నినాదంగా వెళ్లిన వైకాపాకు గట్టి గుణపాఠం చెప్పారు. ఈ క్రమంలో సిఎం పదవికి జగన్ రాజీనామా చేయగా కొత్త సిఎంగా చంద్రబాబు 9న అమరావతిలోనే ప్రమాణం చేయబోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటుపై జనసేనాని పవన్ కళ్యాణ్‌తో కలసి చర్చించనున్నారు. ఎపిలో అవినీతి, అక్రమాలతో పాటు, రాక్షసకాండ సాగించిన వైకాపాను గట్టిగా బుద్ది చెప్పారు. అధికారానికి పనికిరావని తీర్పు చెప్పారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టిడిపి కూటమి 25కు 21 స్థానాల్లో విజయం సాధించే దిశగా ఉంది. వైకాపా కేవలం 4 సీట్లకే పరిమితం అయ్యింది. ఈ క్రమంలో గత ఐదేళ్లు సాగించిన అరాచక పాలనకు వైకాపా మూల్యం చెల్లించుకుంది. ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ దారుణ ఓటమి మూటగట్టుకుంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ తెదేపా నేతృత్వంలోని కూటమికి కనీస స్థాయి పోటీ ఇవ్వలేకపోయింది.
చివరకు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం గమనార్హం. ఆ హోదా రావాలంటే 18 మంది ఎమ్మెల్యేలు గెలుపొందాలి. కానీ వైకాపా మాత్రం.. 8-10 సీట్లకే పరిమితమైంది. వార్ వన్ సైడ్’ అన్నట్లుగా కూటమి దుమ్ములేపింది. జగన్ నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతూ.. కూటమికి ఘన విజయం కట్టబెట్టారు. ఇప్పటికే 117 స్థానాల్లో విజయం సాధించిన కూటమి అభ్యర్థులు.. మరో 17 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. వైకాపా కంటే మెరుగ్గా జనసేన సొంతంగానే 21 స్థానాల్లో గెలుపొందింది. మొదటినుంచి ఫలితాల సరళి చూసి వైకాపాకు ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా? అని రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తం కాగా.. చివరకు అదే నిజమైంది. ఇకపోతే ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి అదరగొట్టింది. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకుగానూ 8 జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఎనిమిది జిల్లాల్లో 110 సీట్లు ఉండగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 110 సీట్లలో విజయం సాధించింది.
ఉమ్మడి విశాఖ, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలోని మొత్తం 10 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఉమ్మడి విశాఖలో 2, ఉమ్మడి ప్రకాశంలో ఒకటి, ఉమ్మడి కడప జిల్లాలో మూడు, కర్నూలు జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 2 నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. ఐదు జిల్లాల పరిధిలోని 65 నియోజకవర్గాలకు కేవలం 10 చోట్ల మాత్రమే వైసీపీ విజయం సాధించింది. మిగతా 55 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలకు 8 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీచేయగా అన్ని స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ, జనసేన చెరో స్థానంలో పోటీచేయగా.. ఆ రెండు చోట్ల బీజేపీ, జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా టీడీపీ 8 స్థానాల్లో జనసేన ఒక చోట విజయం సాధించాయి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా టీడీపీ 13, జనసేన ఐదు, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా టీడీపీ 9, జనసేన 6 స్థానాల్లో పోటీచేయగా.. ఆ రెండు పార్టీలు పోటీచేసిన అన్ని స్థానాల్లో గెలుపొందారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉండగా.. టీడీపీ 13, బీజేపీ 2, జనసేన ఒక స్థానంలో పోటీచేయగా.. ఆ మూడు పార్టీలు అన్ని స్థానాల్లో విజయం సాధించాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉండగా టీడీపీ 16, జనసేన ఒక నియోజకవర్గంలో పోటీచేయగా.. అన్ని స్థానాల్లో గెలుపొందాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా.. టీడీపీ 13, బీజేపీ ఒకచోట విజయం సాధించాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలు ఉండగా.. అన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.
ఉమ్మడి విశాఖలోని అరకు, పాడేరులో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, ఉమ్మడి కడప జిల్లాలో బద్వేలు, రాజంపేట, పులివెందులలో మాత్రమే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఆలూరులో వైసీపీ గెలుపొందింది. చిత్తూరు జిల్లాలోని తంబళప్లలె, పుంగనూరులో మాత్రమే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మంత్రులంతా ఓటమి చెందారు. జగన్ మాత్రమే పులివెందులలో విజయం సాధించారు.