04-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 4: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. ఏ పార్టీ గెలిచినా సాధారణ మెజారిటీ వస్తుందని అంతా భావించగా.. ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు అభినందనలు తెలిపారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్నందున.. తెలుగు రాష్టాల్ర మధ్య సత్సంబంధాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటూ, అభివృద్ధి పథం వైపు సాగుదాం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.