06-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అన్నమయ్య, జూన్ 6: ఏపీలో అధికారం కోల్పోవడంతో వైసీపీ నేతలు హద్దువిూరుతున్నారు. కక్షతో టీడీపీ నేతలపై కార్యకర్తలను ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారు. అర్ధరాత్రి అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం బోయప్లలెలో టీడీపీ వాహనాలపై దాడిచేశారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి జరిగిన సమయంలో కారులో రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి ఉన్నారు. వైసీపీ నేతల దాడిలో టీడీపీ వాహనాలు ధ్వంసమయ్యాయి.
మాధవరం గ్రామంలో టీడీపీ నేత ఇచ్చిన డిన్నర్‌కు వెళుతుండగా ఈ దాడి జరిగింది. విషయం తెలుసుకున్న రాంప్రసాద్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై రాంప్రసాద్ బాధితులతో కలిసి వెళ్లి రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయాలని ఆయన పోలీసులను కోరారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.