06-06-2024 RJ
తెలంగాణ
నల్గొండ, జూన్ 6: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రెండో రౌండ్ పూర్తయింది. మొదటి రౌండ్‌లో 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న.. రెండో రౌండ్‌లోనూ లీడ్‌లో కొనసాగారు. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్‌లో ఆయనకు 34,575 ఓట్లు వచ్చాయి. భారాస అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 27,573 ఓట్లు, భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 12,841 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు రెండో రౌండ్‌లో 11,018 ఓట్లు వచ్చాయి.
నల్గొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో బుధవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు పక్రియ ప్రారంభం అయింది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన 3.36 లక్షల బ్యాలెట్ పత్రాలను 25 చొప్పున తొలుత కట్టలు కట్టారు. ఒక్కో హాల్లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం నాలుగు గదుల్లో 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికలో భారాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక జరిగింది.