06-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 6: మనమంతా కలసి పని చేస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడదామని టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం కోసం ఎంపిలంతా కేంద్రంతో ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలన్నారు. అలాగే తానూ ఎంపిలతో నిరంతరం టచ్‌లో ఉంటానని హావిూ ఇచ్చారు. టిడిపి నుంచి ఎంపికైన కొత్త ఎంపిలతో సమావేశం గురువారం అమరావతిలో జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన టీడీపీ ఎంపీలతో చంద్రబాబు మాట్లాడుతూ.. ఇకపై విూరంతా మారిన చంద్రబాబును చూస్తారని అన్నారు. చంద్రబాబు మారరు.. ఎవరి మాట వినరు అనే మాట ఇక వినిపించబోదని అన్నారు. ఇకపై తనను ఎంపీలు తరచూ కలుస్తూ ఉండాలని కోరారు. ఎంత బిజీగా ఉన్నా పక్కకు వచ్చి మరీ ఎంపీలతో మాట్లాడతానని అన్నారు.
రాష్ట్రంలో ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఉండబోదని.. పూర్తి రాజకీయ పాలన తెస్తామని అన్నారు. ఇకపై విూరు మారిన చంద్రబాబును చూస్తారు. ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రం ఉండదు. చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది. ఇకపై అలా ఉండదు.. విూరే ప్రత్యక్షంగా చూస్తారు. ఎంపీలందరూ తరచూ వచ్చి కలవండి. నేను బిజీగా ఉన్నా కూడా విూతో మాట్లాడతాను. నాకోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారు. కత్తి విూద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారు ` అధికార పార్టీ ఒత్తిడికి ఎవరూ తలొగ్గలేదు. ఇకపై ప్రతి అంశాన్ని నేను వింటాను.. నేనే చూస్తాను. ఇకపై రాజకీయ పరిపాలన ఉంటుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కలిసి పనిచేయాలి. అందరూ ఎవరి పరిధిలో వారు పనిచేయాలి.
ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు పడిన ఇబ్బందులు నాకు చాలా మనోవేదన కలిగించాయి `నేతలు, కార్యకర్తల కష్టం, త్యాగం, కృషి వల్లే ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈనెల 12 ప్రమాణ స్వీకారం చేస్తా. ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. ఎన్నికల్లో గెలిచినందుకు వారికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో మంత్రివర్గ కూర్పు.. తెదేపాకు ఉన్న ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చించారు. ఈ భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు పార్టీ ఎంపీలతో చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి వారితో కలిసి హాజరుకానున్నారు.
ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో విహరించొద్దని గెలిచిన ఎంపీలకు తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని వైకాపా ఎంపీలు జగన్ కేసుల మాఫీ అజెండాతోనే దిల్లీలో పైరవీలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలన్న చంద్రబాబు.. అందుకు తగ్గట్టుగానే పార్లమెంట్‌లో కృషి చేయాలన్నారు. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలి, ఆ తర్వాతే మనమని తెలిపారు. వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా, ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుంది అని గుర్తించాలన్నారు. పదవులు శాశ్వతం అని ఎవ్వరూ అనుకోవద్దని అన్నారు.
సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించానని, వచ్చేందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. అందుబాటులో ఉన్న పలువురు ఎంపీలు ఉండవల్లిలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఇతర ఎంపీలు జూమ్ కాల్ ద్వారా టీడీపీపీలో పాల్గొన్నారు. ఎంపీలు అందరికీ చంద్రబాబు నాయుడు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. రేపటి ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి కూటమిలో భాగమైన టీడీపీ ఎంపీలు అంతా హాజరవ్వనున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీలు నేటి రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. పార్లమెంటరీ భేటీ తర్వాత టీడీపీ ఎంపీలు విూడియాతో మాట్లాడారు.
మోదీ, చంద్రబాబు, పవన్ కృషి వల్లే భారీ విజయం నమోదైందని అన్నారు. తెలుగు ప్రజల్లో ఉన్న కసి కూడా భారీ విజయానికి కారణం అన్నారు. ఎన్నికల ముందు నుంచి ఎన్డీఏ కూటమితో ప్రయాణిస్తున్నామని అన్నారు. ఎన్డీఏ కూటమికే మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. రాష్ట్రానికి అనేక అంశాల్లో కేంద్రం మద్దతు కావాల్సి ఉందని అన్నారు. సమావేశానికి అందుబాటులోని లేని ఎంపిలు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.