06-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 6: రాష్ట్ర శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ జస్టిస్ నజీర్‌కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ విూనా అందచేశారు. ఈ మేరకు విూనా నేతృత్వంలో భారత ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అదనపు సీఈవోలు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజరు కుమార్, జాయింట్ సీఈవో ఎ.వెంకటేశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్ రవీందర్ కుమార్ తదితరులు గురువారం రాజ్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను కలిసారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన శాసన సభ్యులుగా జాబితాను అందజేశారు.
ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 174 ప్రకారం మంత్రివర్గం సిఫార్సు మేరకు ఏపీ శాసనసభను రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టిడిపి 135, జనసేన 21, బిజెపి 8 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందాయి. వైకాపా 11 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.