07-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తిరుపతి, జూన్ 7: ఓటమి చెందినా తన వంతుగా తిరుపతి పార్లమెంటు ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధికి కృషి చేస్తానని బీజేపీ నేత, మాజీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని వరప్రసాద్ అన్నారు. చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయానన్నారు. తాను ఎంపీగా ఉండగా.. జగన్ తన సలహాలు పాటించారని బీజేపీ నేత, మాజీ ఎంపీ వరప్రసాద్ తెలిపారు. సీఎంగా గెలుచిన తరువాత జగన్ బాగా మారిపోయారన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో ధనంజయరెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల మిథున్ రెడ్డి వల్లనే వైసీపీని వీడాల్సి వచ్చిందన్నారు. వైసీపీలో సొంత పార్టీ వారిపై కేసులు పెట్టించిన ఘనత సజ్జలదేనని పేర్కొన్నారు. సిలికా, ఇసుకా అక్రమ రవాణాను అడ్డు కోవడం వారికి తప్పుగా కన్పించిందని వరప్రసాద్ తెలిపారు. రిటైర్ ఐఏఎస్ అధికారిగా తనకు పాలనపై అవగాహన ఉందన్నారు. అక్రమాలను అడ్డుకున్న కారణంగా వైసీపీలో టిక్కెట్ దక్కుతుందని భావించలేదన్నారు. ప్రజలకు సేవ చేయాలని చంద్రబాబు, మోదీ ఆలోచనలు నచ్చి బీజేపీలో చేరి టికెట్ పొందానని వరప్రసాద్ వెల్లడించారు.
సహజ వనరులు దోచుకున్న బియ్యపు మధుసూదన్ రెడ్డి, మిథున్ రెడ్డిలపై జగన్‌కు పిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకులేదన్నారు. వెనకబడిన వర్గాల అభిప్రాయాలను గౌరవించే స్వభావమే జగన్‌కు లేదన్నారు. జగన్ కోటరీలోని ఐదారుగురు రెడ్ల వలనే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందన్నారు. గతంలో జగన్, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలకి సలహాలు ఇచ్చినా పెడచెవిన పెట్టారని వరప్రసాద్ అన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు.. మంచి మనిషిగా బయటికి వచ్చినప్పుడు స్వార్థ పరుడిగా వ్యవహరించారన్నారు. గడచిన 5సంవత్సరాలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని.. నియంతృత్వం, అరాచక పాలన నుంచి కాపాడుకోవడానికి బీజేపీలో చేరానన్నారు. దీనిని అంతం చేయడానికి ముందుకు వచ్చిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ని అభినందిస్తున్నానని తెలిపారు. ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా మోదీ, బీజేపీ అన్యాయం చేయలేదన్నారు. తిరుపతిలో తాను గత 15 సంవత్సరాల్లో పలు అభివృద్ధి పనులు చేశానని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదాను ప్రభుత్వం పరిశీలిస్తుందని వరప్రసాద్ తెలిపారు.