08-06-2024 RJ
తెలంగాణ
వేములవాడ, జూన్ 8: మృగశిర కార్తె వచ్చిందంటే సకలజనులకు వూరట కలుగుతుంది. అప్పటివరకు గ్రీష్మతాపంతో అల్లాడుతున్న సర్వకోటి జీవాలు తొలకరి జల్లులతో స్వాంతన చెందుతారు. రోహిణికార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయి. అనంతరం మృగశిర కార్తె వస్తుంది. రుతుపవనాల రాకను మృగశిరకార్తె ఆహ్వానిస్తుంది. చంద్రుడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తే ఆ రాశి ప్రారంభమవుతుంది. జింక తల కలిగివుండటంతో ఈ కార్తెను మృగశిరకార్తెగా వ్యవహరిస్తారు. ఈ కార్తె మనదేశంపై విశేషప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ రాశిలోనే నైరుతి రుతువపనాలు భారత్‌లోకి ప్రవేశిస్తాయి. అప్పటివరకు నిప్పులు చెలరేగిన భానుడి కిరణాలు నల్లటి మేఘాల ప్రభావంతో చల్లబడుతాయి. దేశానికి జీవధార అయిన వర్షాలతో నేలతల్లి పులకరిస్తుంది. రైతులు తొలకరి జల్లులు పడగానే దుక్కి దున్ని పంటలు వేసేందుకు సిద్ధమవుతారు. ఏరువాకసాగే కాలం అని కూడా అంటారు.మృగశిర నక్షత్రం దేవగణానికి చెందినది.
అధిపతి కుజుడు. రాశి అధిపతులు శుక్రుడు, బుధుడు. ఈ నక్షత్రంలో జన్మించినవారు మంచి అదృష్టం కలిగివుంటారు. సూర్యుడు ఒక్కొక్క నక్షత్రంలో 14 రోజుల పాటు ఉంటాడు. సూర్యుడు ఏ నక్షత్రానికి సవిూపంలో ఉంటే ఆ కాలానికి (కార్తె) ఆ నక్షత్రం పేరు పెడుతారు. సౌరమానం ప్రకారం లెక్కించబడటంతో ఈ కార్తెలు ఆంగ్ల గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారం దాదాపు ప్రతి సంవత్సరం ఒకే తేదిల్లో వస్తాయి. పురాణగాధ ప్రకారం మృగశిరస్సు కలిగిన మృగవ్యాధుడు అను వృతాసురుడు వరప్రభావంచే పశువులను, పంటలను హరించి వేయడం ప్రకృతి భీభత్సాలాను సృష్టించడం, వర్షాలకు అడ్డుపడటం జరుగుతూ ఉండేడిది. ఇతను చనిపోకుండా అనేక వరాలు కలిగి ఉండటంచేత ఇంద్రుడు సముద్ర హలల నుండి వచ్చే నురుగును ఆయుధంగా చేసి చంపేస్తాడు.ఈ కథ ఆధారంగా ఖగోళంలో ఇంద్ర నక్షత్రమైన జ్యేష్టాకు మృగశిరకు 180 డిగ్రీల దూరంలో ఉండటం వలన తూర్పు ఆకాశంలో ఇంద్ర నక్షత్రం ఉదయించగానే వృతాసుర నక్షత్రం అస్తమిస్తుంటుంది. ఇక్కడ నురుగు అనేది ఋతుపవనాలకు, వర్షాలకు సూచన. ఇంద్ర నక్షత్రమైన జ్యేష్ట ఉదయించినపుడు సూర్యుడు మృగశిరలోకి ప్రవేశించడం వలన మృగశిరకార్తె ప్రవేశిస్తుంది. వర్షాలు పడకుండా అడ్డుపడ్డ మృగాసురుని చంపిన ఇంద్రున్ని వర్షప్రదాతగా, వర్షదేవుడుగా పిలుస్తారు. ఇది కథ, ప్రస్తుతం ఈ కార్తె ప్రవేశానికి ముందు తీవ్రమైన ఎండలతో భూమి అంతా వేడేక్కి మానవ శరీరాలు తాపంతో ఉంటాయి.
జూన్ మొదటి వారంలో అంటే సుమారుగా 8తేదీ నుండి ప్రకృతి పరంగా వర్షాలు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణంలో తీవ్రమైన ఎండల నుండి వర్షాల వలన వాతావరణం చల్లబడడంతో మానవుల శరీరంలో కూడా ప్రకృతి మార్పు ప్రభావం పడుతుంది.శరీరం ప్రకృతి యొక్క మార్పును తట్టుకోవడానికి ఈ రోజు ఇంగువబెల్లం తింటారు.మాంసాహారం తీసుకునే వారు చేపలను తింటారు. శాఖాహరులు మాత్రం ఇంగువను బెల్లంలో కలిపి గుండ్రని గోళిలాగ చేసి దేవుని దగ్గర పెట్టి దండం పెట్టుకుని కుటుంబ సభ్యులందరు అన్ని వయస్సులవారు తప్పక తింటారు.ఈ అయుర్వేద పక్రియ వలన శరీరం బలంగా ఉంచుతూ, రోగనిరోధక శక్తిని ప్రసాదిస్తుంది.