08-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం, జూన్ 8: కొత్త ప్రభుత్వం ఏర్పడబోతున్న తరుణంలో.. జిల్లా ప్రాధాన్యం పెరగనుంది. చంద్రబాబు మంత్రివర్గంలో అచ్చన్నాయుడు ఖచ్చితంగా మంత్రి అవుతారని ప్రచారం ఉంది. టిడిపి అధ్యక్షుడిగా, సీనియర్ నేతగా ఉన్న అచ్చన్నకు తొలి జాబితాలోనే పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలావుంటే ఎర్రన్నాయుడు తనయుడు రామమోమన్ నాయుడు కూడా కేంద్రంలో ఏర్పడబోయే ఎన్‌డిఎ ప్రభుత్వంలో చోటు దక్కించుకుంటారని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఒకే ఇంటినుంచి ఒకరు రాష్ట్రంలో, మరొకరు కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఘనత శ్రీకాకుళానికి దక్కనుంది. ఇకపోతే మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో జిల్లాలో కూటమి అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు.. ఎనిమిదికి ఎనిమిది చోట్లా క్లీన్‌స్వీప్ చేశారు. విజేతల్లో నలుగురు కొత్తగా అసెంబ్లీ మెట్లు ఎక్కుతుండగా, మిగిలిన నలుగురు సీనియర్లే.
ఈనెల 12న నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు క్యాబినెట్‌లోకి మంత్రులుగా కొందరు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి మంత్రి యోగం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ జిల్లా వాసుల్లో నెలకొంది. ముఖ్యంగా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, బెందాళం అశోక్, మహిళా కోటాలో గౌతు శిరీష కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియారిటీ, సామాజిక వర్గాల ప్రాతిపదికన జిల్లాకు రెండు పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. టెక్కలి నుంచి మూడోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన కింజరాపు అచ్చెన్నాయుడు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా కీలక నేతగానూ ఉన్నారు. దీనికితోడు జిల్లాలోనూ సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. గత ప్రభుత్వంపై తిరుగులేని పోరాటం చేశారు. అక్రమాలు, అవినీతిని ఎండగట్టారు.
కష్టసమయంలో జిల్లా ప్రజలకు అండగా నిలిచారు. జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్రపోషిస్తున్నారు. ఈ పరిస్థితులతో అచ్చెన్నాయుడుకు బెర్తు ఖాయమనే పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆమదాలవలస నియోజకవర్గం నుంచి కూన రవికుమార్, ఇచ్ఛాపురం నుంచి బెందాళం అశోక్ పేర్లు వినిపిస్తున్నాయి. అశోక్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. సౌమ్యుడిగా పేరు ఉంది. 2019లో వైకాపా గాలిలోనూ విజయం సాధించారు. కూన రవికుమార్ ఆమదాలవలస నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచారు. తాజాగా స్పీకరు తమ్మినేని సీతరాంపైనే పోటీ చేసి గెలుపొందారు. కష్టకాలంలో తెదేపా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి కార్యకర్తలకు అండగా నిలిచారు. అధికార పక్ష నేతలు కేసులు పెట్టి అనేక ఇబ్బందులకు గురిచేశారు. గతంలో విప్‌గానూ పనిచేశారు. అశోక్, కూన ఇద్దరూ సీనియర్లు, ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఒక్కరి చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. మహిళ, యువత కోటాలో పలాస నుంచి గౌతు శిరీష మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. గౌతు లచ్చన్న మనవరాలిగా, మాజీ మంత్రి గౌతు శివాజీ కుమార్తెగా ప్రజల ముందుకొచ్చారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన శిరీష అటు వైకాపా మంత్రి అప్పలరాజు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసినా వాటిని ఎదుర్కొని అప్పలరాజుపై ఘన విజయం సాధించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి కార్యకర్తలకు ధైర్యం నింపుతూ అడుగులు వేశారు. దీంతో ఆమెకు క్యాబినెట్‌లో చోటు దక్కుతుందని కార్యకర్తలు, నేతలు ఆశిస్తున్నారు. ఇకపోతే మాజీ కేంద్రమంత్రి, దివంగత ఎర్రన్నాయుడు వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, పార్లమెంట్ సభ్యుడిగా మూడుసార్లు గెలుపొందిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు హ్యాట్రిక్‌తో సత్తాచాటారు.
2014 ఎన్నికల్లో తొలిసారి 1.27 లక్షలకు పైగా మెజార్టీ సాధించారు. తాజా ఎన్నికల్లో 3,27,901 ఓట్ల మెజార్టీతో రికార్డు సృష్టించారు. ఈ విజయం జిల్లా చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం ఎన్‌డీఏ కూటమిలో తెదేపా చేరడం, కీలకభూమిక పోషిస్తున్న నేపథ్యంలో రాష్టాన్రి మూడు, నాలుగు మంత్రి పదవులు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఇందులో మొదటి పేరు రామ్మోహన్‌నాయుడిదే అంటూ ప్రచారం జరుగుతోంది. హిందీ, ఆంగ్లంతో పాటు, తెలుగులోనూ మంచి వక్తగా పేరుంది. గతంలో వాజ్‌పేయీ హయాంలో తండ్రి ఎర్రన్నాయుడు కేంద్రమంత్రిగా పనిచేశారు. ఎంపీగా పదేళ్ల రాజకీయ జీవితంలో రామ్మోహన్‌నాయుడు వివాదారహితుడిగా, సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్రం కోసం ఆయన పార్లమెంట్, వెలుపల చేసిన ప్రసంగాలు ప్రజలకు చేరువ చేశాయి.
ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని, రైల్వే జోన్, రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్‌లో గళం విప్పిన తీరు ప్రజల్ని ఆకట్టుకుంది. జిల్లాలో రాజకీయ ప్రసంగాలకు ప్రజాదరణ గణనీయంగా పెరిగింది. ఆయన హాజరయ్యే సభలు, సమావేశాలకు జనం పోటెత్తడమే నిదర్శనం. పార్లమెంట్‌లోనూ వివిధ సందర్భాల్లో తన వాణిని గట్టిగా వినిపించారు. ఆయనకు ఎన్‌డిఎలో అవకాశం దక్కితే జిల్లాకు ప్రాధాన్యం పెరిగినట్లుగానే భావించాలి.