08-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తిరుమల, జూన్ 8: తెలుగు రాష్టాల్ర మాజీ సీఎంలపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్, జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. అహంకారంతో విర్రవీగితే ప్రజలు ఇలాగే సమాధానం చెప్తారని ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఎమ్మెల్యే వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విూడియాతో మాట్లాడారు. కేంద్రంలో మోడీకి సైతం ఆదరణ తగ్గిందని, దానికి ఎన్డీయే కూటమి గెలుపొందని సీట్లే నిదర్శనమన్నారు ఎమ్మెల్యే వివేక్.
లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఈడీ, సీబీఐలతో అభ్యర్థులను బెదిరించి గెలవాలని చూసిందని ఆరోపించారు. కానీ ప్రజలంతా గమనిస్తున్నారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీ వచ్చిందన్నారు. పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ మంచి మెజారిటీతో గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అహంకార నేతలకు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.