08-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జూన్ 8: ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లుగా రేషన్ డీలర్లకు వైసీపీ ప్రభుత్వం నరకం చూపించిందని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు అన్నారు. నాలుగు దశాబ్దాల రేషన్ డీలర్ల చరిత్రలో ఎప్పుడూ పడని నరకాన్ని జగన్ హయంలో అనుభవించామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వాహణ దారుల సంక్షేమ సంఘం ఆంధప్రదేశ్ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు దగ్గర్నుంచీ ఐదేళ్ల క్రితం వరకూ రేషన్ డీలర్లను ఎంతో గౌరవప్రదంగా చూశారు. కానీ ఐదేళ్ల జగన్ పాలనలో ఎన్నో బాధలు పడ్డాం.
ముఖ్యంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరావు మమ్మల్ని ఎంతో అవమానించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు న్యాయం చేస్తామంటూ కూటమి మేనిఫెస్టోలో పెట్టడం చాలా సంతోషకరం. డీలర్లలందరికీ పూర్వ వైభవం నెల రోజుల్లోనే వస్తుందని ఆశిస్తున్నాం. గౌరవ వేతనం, కవిూషన్, జీవో నెంబరు 5లో ఉన్న సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హావిూ ఇచ్చారు. అందుకే ఈసారి ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో డీలర్లంతా కూటమి వెంటే ఉండి వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ మా ద్వారానే పంపిణీ చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని’ అని చంద్రబాబుకు మాధవరావు విజ్ఞప్తి చేశారు.