08-06-2024 RJ
తెలంగాణ
నల్గొండ, జూన్ 8: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. టూరిజం ప్రమోషన్‌లో భాగంగా నాగార్జున సాగర్‌లోని బుద్ధవనాన్ని మంత్రి జూపల్లి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా నాగార్జున సాగర్‌లో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని గొప్పగా నిర్మించారని చెప్పారు. ఆచార్య నాగార్జునుడు నడయాడిన ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా మరింత అభివృద్ధి చేస్తామని హావిూ ఇచ్చారు. బౌద్ధ టూరిజం సర్క్యూట్‌లో తెలంగాణలోని బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. భారతదేశానికి, ప్రపంచానికి బౌద్ధ వారసత్వం, సంస్కృతిని చాటి చెప్పాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.
నాగార్జున సాగర్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం వల్ల ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఇదిలావుంటే ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణం పట్ల మంత్రి జూపల్లి కృష్ణారావు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతుణ్ని ప్రార్థించారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. తన జీవితపర్యంతం విలువలు, నిబద్ధత, క్రమశిక్షణ, అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, నైతిక విలువలు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన మహనీయుడని అన్నారు. పత్రికా, సామాజిక రంగాల్లో చేసిన కృషిని, అందించిన సేవలను మంత్రి కొనియాడారు. తెలుగు పత్రిక, టెలివిజన్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన సృజనాత్మక రూపశిల్పి రామోజీరావు అని, ఆయన లేనీ లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు.