11-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 11: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఈనెల 12న కేసరపల్లి ఐటి పార్కు ప్రాంగణంలో జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరు కానున్నారు. 12వ తేదీ ఉదయం 8.20 గం.లకు ఢిల్లీ నుండి విమానంలో బయలుదేరి ఉ.10.40.గం.లకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. ఉదయం 10.55 గం.లకు అక్కడ నుంచి ఐటి పార్కు ప్రాంగణానికి చేరుకుని ఉ.11 నుండి మధ్యాహ్నం 12.30 గం.ల వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.40 గం.లకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని 12.45 గం.లకు విమానంలో భువనేశ్వర్ బయల్దేరి వెళ్తారు.
మోదీ పర్యటన నేపథ్యంలో కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. కాగా సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతో పాటు, హోం మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. సాధారణంగా ఏదైనా కార్యక్రమానికి మోదీ, అమిత్‌షాల్లో ఒకరు మాత్రమే హాజరు అవుతుంటారు. కానీ దీనికి మాత్రం ఇద్దరూ వస్తున్నారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ అధినేత ప్రాధాన్యానికి ఇది నిదర్శనంగా చెబుతున్నారు. మరి కొందరు కేంద్ర మంత్రులు, పొరుగు రాష్ట్రాల సీఎంలు కూడా హాజరవుతున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. తమిళనాడు నుంచి కొందరు మంత్రులతో ఒక సౌహార్ద ప్రతినిధి బృందం హాజరవు తోంది. పోయినసారి జగన్మోహన రెడ్డి ప్రమాణ స్వీకారానికి అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరయ్యారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానాలను ఎన్డీయే కూటమి సీఎంలకే పరిమితం చేయడంతో పొరుగు రాష్టా ముఖ్యమంత్రులు రావడం లేదు. ఈ క్రమంలో తెలంగాణ సిఎం రేవంత్‌కు కూడా ఆహ్వానం పంపకపోవచ్చని తెలుస్తోంది. ప్రమాణస్వీకార వేదికను బాగా విశాలంగా ఏర్పాటు చేస్తున్నారు. సుమారు ఏభై వేల మంది కూర్చోవడానికి వీలుగా మైదానంలో కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. అంతకు మించి వచ్చిన వారు ప్రాంగణం బయట ఉండాల్సిన పరిస్ధితి నెలకొంది. వారి కోసం ప్రాంగణం బయట డిజిటల్ తెరలు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ జిల్లాల్లో వస్తున్న స్పందనను బట్టి ఈ సభకు సుమారుగా లక్ష నుంచి లక్షన్నర మంది హాజరు కావచ్చునని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పది వేల వాహనాలు రావచ్చునన్న లెక్కతో వాటికి సరిపోను పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక అతిథులుగా జగన్ బాధితులు హాజరవుతున్నారు. జగన్ ప్రభుత్వంలో వేర్వేరు కారణాలతో బాధితులుగా మారిన 112 మందిని గుర్తించి, వారికి ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపించారు. కర్నూలు జిల్లాలో పోలీసులు వేధిస్తున్నారంటూ కుటుంబంతో సహా సామూహికంగా ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం బంధువులను ఈ కార్యక్రమం కోసం పిలిచారు. అలాగే, ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసిన దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులకు ఆహ్వానం అందింది. కరోనా సమయంలో మాస్క్‌లు అడిగిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్‌ను వేధించి ఆయన చావుకు సర్కార్ కారణమైంది. ఆయన కుటుంబసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.