11-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 11: జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కల్యాణ్ ఎన్నికయ్యారు. మంగళవారంఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్‌ను ప్రతిపాదించారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా బలపరిచారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 164 సీట్లు సాధించిన విషయం తెలిసిందే. కూటమిలో భాగమైన జనసేన 21 సీట్లు గెలుచుకుంది. అయితే ఈ నెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు మరికొంతమంది కూటమి ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. జనసేన నుంచి 4 మంత్రి పదవులను అడుగుతారని తెలుస్తోంది.
పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి ఖరారైనట్టు సమాచారం. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌కు సైతం మంత్రి పదవి దక్కనుందని టాక్. అయితే సోషల్ విూడియాలో మరో రెండు పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. వాటిలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్‌లను మంత్రులుగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. జనసేన కేంద్ర కార్యాలయంలో సోమవారం పవన్ కళ్యాణ్ కీలక నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై పవన్ చర్చించారు. మంత్రి వర్గంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరనే దానిపైనా చర్చించినట్టుగా తెలుస్తోంది.