11-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 11: టీడీఎల్పీ నేతగా అధినేత చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అచ్చన్నాయుడు ప్రతిపాదనను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు.. గవర్నర్‌కు కూటమి పక్షాల నేతలు లేఖ ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు.. సాయంత్రానికల్లా చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించనున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో రాజధాని గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంది.
రాజధాని కోసం భూమిచ్చిన రైతులు దాదాపు ఐదేళ్ల పాటు తమ పోరాటాన్ని కొనసాగించారు. వైసీపీ ప్రభుత్వం కారణంగా నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయంతో రాజధాని గ్రామాల్లోని రైతులంతా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. బుధవారం చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రాజధాని గ్రామ వాసులంతా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్దులకు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంటింటికి తిరిగి స్వీట్ బాక్స్‌లు రాజధాని రైతులు పంపిణీ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో తిరిగి అమరావతికి పునర్జీవం వచ్చిందని చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు రాకతో అమరావతికి మహర్దశ పట్టిందనే చెప్పాలి.