11-06-2024 RJ
తెలంగాణ
కామారెడ్డి, జూన్ 11: దేవుడి పేరిట ఓట్లు అడగడం.. రాముడి పేరిట దొంగ అక్షింతలు పంచడం వల్లే ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ మెజార్టీ తగ్గిందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీకి వెళ్లాయన్నారు. అయోధ్యలోనే వారి పార్టీ ఓడిపోయిందంటూ బీజేపీపై ఆయన పరోక్షంగా విమర్శించారు. గాంధారి మండలం సర్వాపూర్ గ్రామాధ్యక్షుడు వెంకట్ అకాల మృతి చెందారు. ఈ నేపథ్యంలో అతడి కుటుంబాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకట్ కుటుంబానికి రూ. 4 లక్షలు ఆర్థిక సాయాన్ని ఆయన అందించారు. ఈ నగదును సొంత ఇంటి నిర్మాణానికి వినియోగించుకోవాలని ఆ కుటుంబానికి ఆయన సూచించారు.
వెంకట్ భార్యకు వితంతు పెన్షన్ మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన హావిూ ఇచ్చారు. తన జీతంలో ఒక్క రూపాయి తీసుకుని మిగతాది ప్రజల సేవకు ఉపయోగిస్తానని ఎన్నికల్లో హావిూ ఇచ్చానని, అందువల్ల ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని నాలుగు లక్షలు మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అందచేశానని అన్నారు. ఇదిలావుంటే బుధవారం నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో పిల్లకు డ్రెస్సులను, పుస్తకాలను అందచేశారు. పిల్లలను బడిలో చేర్పించాలని, వారిని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చాలని అన్నారు. అలాగే వారికి ప్రబుత్వం అండగా ఉంటుందని అన్నారు.