11-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 11: ఎన్డీయే కూటమి సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును టీడీపీ - జనసేన - బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకే వేదికపై ఆశీనులయ్యారు. ఈ వేదికపై చంద్రబాబు కోసం ప్రత్యేక కుర్చీని సిద్ధం చేయగా ఆయన తిరస్కరించారు. కూటమి నేతలందరికీ ఒకే తరహా కుర్చీ ఉండాలని భద్రతా సిబ్బందికి చెప్పారు. దీంతో వారు సాధారణ కుర్చీని తెప్పించగా.. దానిపై కూర్చున్నారు. ఇది చంద్రబాబు సంస్కారం అని టీడీపీ నేతలు కొనియాడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తనను కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న నేతలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
ఏపీలో గత ఐదేళ్లలో విధ్వంస పాలన సాగిందని.. తాము సామాన్యులుగానే ఉంటామని.. అలానే ప్రజల్లోకి వెళ్తామని స్ఫష్టం చేశారు. తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్ష ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర మంత్రివర్గంలో రాష్టాన్రికి సముచిత స్థానం దక్కిందని.. ముగ్గురు ఎంపీలకు కేంద్ర మంత్రులుగా అవకాశం వచ్చిందని చెప్పారు. రామ్మోహన్, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మకు కేబినెట్ లో చోటు కల్పించారు. సామాన్య కార్యకర్తకు సముచిత స్థానం కల్పించారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమి కూడా అలానే పని చేస్తాయి. పదేళ్ల మోదీ పరిపాలన దేశప్రతిష్టను పెంచింది. ప్రపంచంలో భారతీయులకు గుర్తింపు తీసుకొచ్చింది. మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగబోతోంది. ప్రధాని మోదీ కల వికసిత్ భారత్-2047 అయితే, మనది వికసిత్ ఆంధప్రదేశ్.. ఇదే లక్ష్యంతో ముందుకెళ్లాలి. అని చంద్రబాబు పిలుపునిచ్చారు.