11-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 11: ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న వేళ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందలేదు. కేవలం ఎన్‌డిఎ మిత్రులకు, సిఎంలకు మాత్రమే ఆహ్వానాలు అందినట్లు సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్ సిఎంగా ఉన్న రేవంత్ రెడ్డికి ఆహ్వానం పంపలేదు. అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అహ్వానం అందలేదు. మొదటి నుండి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నా రేవంత్ రెడ్డి టీడీపీలోనే ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పని చేశారు. అనంతరం రాజకీయ అనివార్యతతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
2023 డిసెంబర్‌లో రేవంత్ రెడ్డి సీఎం కాగానే చంద్రబాబు పోన్ చేసి అభినందించారు. అనంతరం జరిగిన ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు ఘన విజయం సాదించారు. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర వాతావరణం ఉండాలని, విభజన చట్టాలను స్నేహపూర్వక వాతవరణం అమలు చేసుకోవాలని ఇరువురు అబిప్రాయాపడ్డారు. ఈ పరిణామాలతో తాజాగా ఏపీలో జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి హాజరవుతారని అందరు అనుకున్నారు. కానీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఇప్పటి వరకు ఎలాంటి అహ్వానం అందలేదని తెలుస్తోంది.
దీంతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హజరు కావడం లేదని సమాచారం. సాధారణంగా ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాలకు పక్క రాష్ట్రాల సీఎంలను పిలవడం అనావాయితీ. గతంలో ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తెలంగాణ సీఎంగా ఉన్న కేసిఆర్ హజరయ్యారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ లో కీలక భాగస్వామిగా ఉండటం, తెలంగాణలో ఇండియా కూటిమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో, ఆహ్వానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి వస్తుండటంతో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇండియా కూటమి నేతలు వేదికను పంచుకోవడం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి ఏపీ సర్కార్ ఆహ్వానం పంపకపోవడానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు.