12-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
భారతదేశం పునాదులే ప్రజాస్వామిక వ్యవస్థపై ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా ఇదే విధానం అవలంబించి, ప్రజల్లో ఉన్నంత కాలం మనగలుగుతాయి. అలాకాకుండా ఏకపక్ష, నిరంకుశ, కుటుంబ పాలనకు కట్టుబడితే అవి కాలక్రమంలో అంతర్థానం అవుతాయి. తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్వర్గీయ ఎన్టీ రామారావు ఓ ఉదాత్త ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఉన్నంత కాలం పార్టీని అదే ఆశయంతో నడిపించారు. పార్టీ ఏర్పాటుతో బడుగు, బలహీనవర్గాలకు రాజకీయ ప్రవేశం దక్కింది.ఎందరికో టిడిపి రాజకీయ ఆశ్రయం ఇచ్చింది. ఎందరో రాజకీయాంగా ఎదిగారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా మార్పులు తీసుకుని రావడంలో టిడిపి కీలక భూమిక పోషించింది.ఎన్నో ఒడిదుడు కులు ఎదుర్కొన్నా ప్రజల్లో నిరంతరంగా నిలిచి వారితో కలసి నడిచింది. ప్రధానంగా బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు రాజకీయ వేదికగా నిలిచింది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం నింపింది.
చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు అందుకున్నాక కూడా పార్టీని నిరంతరం ప్రజల్లో ఉండేలా చేయడంలో విజయం సాధించారు. ఆ మేరకు కృతకృత్యులు అయ్యారు. ఇది ప్రజల పార్టీ అని నిరూపించారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ కాలం నుంచి నేటి వరకు అధికారంలో ఉన్నా..లేకున్నా ప్రజల్లో నిలవడానికి కూడా కారణం అదే. అంకితభావం కలిగిన కార్యకర్తలు తోడుగా ఉన్నారు. పార్టీలోకి ఎందరో వచ్చినా..ఎందరో వెళ్లినా, అధికారం లో ఉన్నా, అధికారం లో లేకున్నా పార్టీ మాత్రం చెక్కుచెదరలేదు. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు దక్షతకు ఇది నిదర్శనం. దేశంలో ఎన్నో పార్టీలు వచ్చాయి. పోయాయి. ఎందరో తెరమరుగు అయ్చారు. ఎన్నో పార్టీలు ప్రజల నుంచి దూరం అయ్యాయి. అయితే టిడిపి మాత్రం తన ఉనికిని చాటుతూ ప్రజల్లో నిరంతరంగా ఉండేలా ఎప్పటి కప్పుడు తన ప్రణాళికలు మార్చుకుంటూ ముందుకు సాగడంలో నాయకత్వం చేస్తున్న కృషిని అభినందిం చాల్సిందే. చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో, ఓ 15 ఏళ్లు విపక్షంలో ఉన్నా.. పార్టీని ఎక్కడా పట్టు సడలకుండా కాపాడుకోగలిగారు.
కొందరు నేతలు పార్టీని విడిచి వెళ్లినా పట్టించుకోలేదు. గత ఐదేళ్లలో జగన్ చంద్రబాబునే టార్గెట్ చేసి,టిడిపిని అణచివేయాలని చూశారు. కేసులతో నేతలను జైల్లో వేయించారు. అలాగే అనేక రకాలుగా విధ్వంస పాలన చేసారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పట్టించుకోలేదు. ఇదంతా విపక్షాల దుష్పచ్రారంగా ప్రచారం చేశారు. అయినా టిడిపి ఎక్కడా చెక్కుచెదరలేదు. తన పట్టును వీడలేదు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేసింది. ప్రజల్లో విశ్వాసం కలిగించింది. ఓ రకంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీల్లో గట్టిగా నిలబడ గలిగిన పార్టీల్లో తెలుగుదేశం ముందుంటుంది. తమిళనాట అధికారంలో ఉన్న డిఎంకె కూడా అలాగే నిలిచింది. జయలలిత మరణం తరవాత అన్నాడిఎంకె ఇప్పుడు అంతర్థానం దశలో ఉంది. కర్నాకటలో జనతాదల్ యూ కూడా అదే దశలో ఉంది. తెలంగాణలో కూడా బిఆర్‌ఎస్ అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రజలు ఆదరించి అక్కున చేర్చు కుంటే కేసిఆర్ వారికే పంగనామాలు పెట్టి, పాలనలో దొరలపోకడలను చొప్పించి, నిరంకుశ విధానాలకు పట్టం కట్టారు.
ప్రజలు ఇలాంటి పార్టీ మనకొద్దని మొన్నటి ఎన్నికల్లో దూరం పెట్టారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో అప్రతిహతంగా అత్యధిక స్థానాలను సాధించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన బిజెపి, ఈసారి తగిన స్థానాలను దక్కించుకోవడంలో కూడా నిరంకుశ విధానాలు అవలంబించడమే అని నిర్మొహ మాటంగా చెప్పుకోవాల్సిందే. ప్రజాస్వామ్య యుతంగా ఉన్న బిజెపిలో మోడీ నిరంకుశ విధానాలతో పార్టీని దిగజార్చారు. ఎన్‌డిఎ పక్షాలతో ఇప్పుడు ఆ పార్టీ నిలబడ్డా..అదే విధానాలను మోడీ కొనసాగిస్తే..బిజెపి కూడా అంతర్ధానదశకు చేరుకుంటుందని గుర్తించాలి. మోడీ ద్వయం అనుసరించిన నిరంకుశ విధానాల కారణంగా మొన్నటి ఎన్నికల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో ప్రజలను పట్టించుకోక పోవడంతో ప్రజలు మోడీకి కూడా చెక్ పెట్టేంత పని చేసారు.ఇదో హెచ్చరికగా మోడీ గుర్తించాలి. తాము కోరుకున్న 400 సీట్ల లక్ష్యం సాధించడంలో వెనుక బడడమే గాక, విపక్షాల నుంచి గట్టి పోటీని ఎదుర్కోవలసి వచ్చింది.
అందుకే పొత్తు కుదుర్చుకునే అవసరం ఇప్పటివరకు రాకపోయినప్పటికీ, తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్ పొత్తుతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పలేదు. దీంతో తెలుగుదేశం, జెడి(యు) పార్టీలకు ఎన్‌డిఎ ప్రభుత్వంలో అత్యున్నత భాగస్వామ్యం పొందే అవకాశం లభించింది. ఈ అవకాశం అన్నిప్రాంతీయ పార్టీలకు లభించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య పరిణామా లు తలెత్తడంతో ప్రస్తుతం బిజూ జనతాదళ్, బహుజన సమాజ్, జననాయక్ జనతా,టిఆర్‌ఎస్, అన్నా డిఎంకె ఈ ఐదు ప్రాంతీయ పార్టీల ఉనికి దెబ్బతింది. ఇవి తిరిగి కోలుకుంటాయన్న నమ్మకం కూడా కలగడం లేదు. ఈ పార్టీలన్నీ పార్లమెంట్‌లో తమ గొంతు వినిపించే అవకాశాన్ని కోల్పోయాయి. ఈ పార్టీలన్నీ ఒకప్పుడు ముఖ్య మంత్రులను, ఒకానొక సందర్భంలో పార్లమెంట్‌కు విశేష సంఖ్యలో ఎంపిలను పంపించినవేనని గుర్తించాలి.
1997లో బిజూ జనతాదళ్ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఎలాంటి ఎదురీత లేని పార్టీ ఇప్పుడు పార్లమెంట్‌లో తన ప్రాతినిధ్యం అన్నది లేకుండా పోయింది. మొట్టమొదటిసారి 2009 తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ మెజార్టీ సాధించుకోలేకపోయింది. గత 24 ఏళ్లుగా తిరుగులేని ముఖ్యమంత్రిగా నెగ్గుకుంటూ వస్తున్న నవీన్ పట్నాయక్ ఇప్పుడు పక్కకు తప్పుకోవలసి వచ్చింది. ప్రాంతీయ పార్టీల్లో ఒకప్పుడు మిగతా పార్టీలన్నిటినీ తుడిచిపెట్టేసిన బిజూ జనతాదళ్ పార్టీ ఇప్పుడు ఈ ఏడాది ఒక్క సీటు కూడా సాధించలేని స్థితికి దిగజారిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ ది కూడా ఇదే పరిస్థితి. ఒకప్పుడు దళితుల గొంతుగా గుర్తింపు పొందిన బిఎస్పీ ఉత్తరప్రదేశ్‌లో తన పట్టును కోల్పోయే పరిస్థితి దాపురించింది. హర్యానాలో ఉత్తర ఎగువ నియోజక వర్గంలో జననాయక్ జనతా పార్టీ కూడా రాష్ట్రంలోని తనకున్న పది స్థానాలను కోల్పోయింది. మాజీ ఉప ప్రధాని దేవీలాల్ భావజాలంతో 2018లో ఈ పార్టీ ఏర్పాటైంది.
2019 లో హర్యానా శాసన సభ ఎన్నికల్లో 10 స్థానాలను గెలుచుకోగా, ఈ ఏడాది మార్చి వరకు రాష్ట్రాన్ని పాలించిన బిజెపి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండేది. 2019 ఎన్నికల్లోనూ ఇప్పుడు కూడా కనీసం ఒక్క ఎంపి సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఇంకా దక్షిణాదిలో తమిళనాడుకు చెందిన ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె)ను అగ్రనటుడు, ఎంజిఆర్ స్థాపించగా, తరువాత నటి జయలలిత సారథ్యం వహించారు. ఆమె ఉన్నంత కాలం పార్టీ బాగా నడిచింది. ఆటుపోట్లను ఎదుర్కొంది.. కానీ ఇప్పుడా పార్టీకి మనుగడ లేనట్టుగానే భావించాలి. తమిళనాడులో తాను పోటీకి నిలబడిన మొత్తం 32 స్థానాలను కోల్పోయింది. ఇక తెలంగాణలోనూ దశాబ్దం పాటు పాలించిన కెసిఆర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందారు. ఆరు నెలల వ్యవధిలో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపి సీట్లలో ఒక్కటి కూడా గెలవలేదు.
అసెంబ్లీలో ఉన్న 39 సీట్లకు ఓ సీటును ఉప ఎన్నికల్లో పోయింది. 38 మందిలో ముగ్గురు పోను 35మంది ఎమ్మెల్యేలు ఉంటారో, జెండా ఎగరేస్తారో తెలియని పరిస్థితి. ఇదంతా పార్టీలో ప్రజలకు భాగస్వామ్యం లేకపోవడం వల్లనే అని గుర్తించాలి. ఇలాంటి పార్టీలు అంతర్థానం కాక తప్పదు. ప్రజల్లో పునాది వేసుకుంటే తప్ప నిలబడవని గుర్తించాలి. టిడిపి అలాకాకుండా ప్రజలతో నిరంతరాయంగా పెనవేసుకుని ముందుకు సాగేలా చేసుకోవడం వల్లనే నిలబడ గలిగింది. తన ప్రజాస్వామ్య మూలాలను ఎక్కడా వదులుకోకపోవడం వల్లనే ఇది సాధ్యం అయ్యింది.