12-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 12: దేశంలో నిత్యవాసర ధరల పెరుగుదల అనూహ్యంగా ఉంది. ఉప్పులు పప్పుల ధరలు అమాంతంగా పెరిగాయి. ఎన్నికల కాలంలో పట్టించుకునే వారు లేకపోవడంతో ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇందులో నిత్యం వాడే ఉల్లికూడా చేరింది. ఎన్నికల ముందు వరకు అదుపులో ఉన్న ఉల్లిగడ్డల ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. వర్షాకాలం ముందే వీటికి డిమాండ్ పెరిగినట్టు పేర్కొంటున్నారు. రిటైల్ మార్కెట్లో ఇప్పుడు ఉల్లిగడ్డ కిలో 50 రూపాయాలు పలుకుతోంది. మొన్నటి వరకు 25, 30 రూపాయల మధ్య ఉన్న దర అమాంతంగా పెరిగింది. గత రెండు వారాలుగా వీటి ధరలు 30 నుంచి 50 శాతం పెరిగాయి. ఇటీవల వరకు కేంద్రం తీసుకున్న కొన్ని చర్యల కారణంగా ఉల్లిగడ్డల ధరలు అదుపులో ఉన్నాయి. అయితే వాటిని సడలిస్తుందన్న ఆశతో కొందరు వ్యాపారులు పెద్దయెత్తున స్టాక్‌ను నిలువచేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.
మహారాష్ట్రలోని నాసిక్ ఉల్లి మార్కెట్‌లో సోమవారం సాధారణ రకం ఉల్లిగడ్డలు కిలో ధర రూ.26 ఉంది. ఇదే ఉల్లిగడ్డల ధర మే 25న రూ.17 ఉంది. అదే నాణ్యమైన ఉల్లి కిలో రూ.30 వరకు అమ్ముతున్నారు. ఇప్పటివరకు ఉల్లి ఎగుమతులపై కేంద్రం విధిస్తున్న సుంకాలను త్వరలోనే రద్దు చేస్తుందన్న వార్తలతో వ్యాపారులు ఉల్లిని పెద్దయెత్తున నిల్వ ఉంచడంతో డిమాండ్‌కు సప్లయికి మధ్య వ్యత్యాసం పెరిగి ధరలు పెరుగుతున్నాయని కొందరు ఆర్థిక నిపుణులు తెలిపారు. ఉల్లి లేని వంటకం ఉప్పు లేని పప్పుతో సమానం. శాఖాహారమైనా, మాంసాహారమైనా ఉల్లిపాయ లేకుండా వంట పూర్తి కాదు. అలాంటి ఉల్లితో వ్యాపారులు ఏటా చెలగాటమాడుతూనే ఉంటారు. బ్లాక్ మార్కెట్లోకి తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తుంటారు. ప్రస్తుతం మన దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి.
గత 15 రోజులుగా ఉల్లి రేట్లు 30శాతం నుంచి 50శాతం వరకు పెరిగాయి. మన మార్కెట్లలోకి క్రమంగా ఉల్లి సరఫరా తగ్గు తోంది. పూర్తిగా వర్షాకాలం రాక ముందే ఉల్లిపాయలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో, పెరుగుతున్న ఉల్లి ధరలకు క్లళెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మన దేశంలో ఉల్లికి అతి ప్రధాన మార్కెట్ మహారాష్ట్రలోని నాసిక్‌లోని లాసల్‌గావ్ మండి. ఈ మార్కెట్‌లో ఉల్లి సగటు టోకు ధర గణనీయంగా పెరిగింది. సోమవారం ఇక్కడ హోల్‌సేల్ ధర కిలోకు సగటున 26 రూపాయలు పలికింది. గత నెల 25వ తేదీన ఈ రేటు కిలోకు సగటున 17 రూపాయలు గా మాత్రమే ఉంది. ఇప్పుడు, నాణ్యమైన ఉల్లి ధరలు మహారాష్ట్రలోని చాలా హోల్‌సేల్ మార్కెట్‌లలో కిలోకు 30 రూపాయలు దాటాయి.
అయితే ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ఉల్లి ధరలు 50 రూపాయలుగా ఉంది. గత 15 రోజులుగా ఉల్లి ధరలు పెరగడానికి ప్రధాన కారణం డిమాండ్ ` సప్లయ్ మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండడం. ఈ నెల ప్రారంభం నుంచి మార్కెట్లలోకి వస్తున్న ఉల్లి పంట గత సీజన్లలో పండినదేగానీ, కొత్తది కాదు. ఉల్లి రైతులు, వ్యాపారులు పంటను ఇప్పటి వరకు నిల్వ చేసి, ఇప్పుడు మార్కెట్లలోకి తీసుకువస్తున్నారు. 2023-24 రబీ సీజన్‌లో దిగుబడి తగ్గవచ్చని, దీనివల్ల ఉల్లి రేట్లు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉల్లి పంటపై ఎగుమతి సుంకాన్ని త్వరలోనే తొలగిస్తుందని రైతులు, వ్యాపారులు ఆశిస్తున్నారు. ఈ అంచనా ఆధారంగా స్టాకిస్టులు ఉల్లిపాయలను భారీగా నిల్వ చేస్తున్నారు. ఎగుమతి సుంకాన్ని తొలగించిన తర్వాత ఉల్లి ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు.
ప్రస్తుతం, ఉల్లి ఎగుమతిపై 40 శాతం ఎగుమతి సుంకం అమల్లో ఉంది. దీని కారణంగా ఉల్లి ఎగుమతుల్లో వేగం నెమ్మదిగా ఉంది. మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లికి డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందని వ్యాపారులు అంటున్నారు. కర్నూలులో పంట దగుబడులు తగ్గడం కూడా ఓ కారణంగా చూడాలి. మొత్తంగా మార్కెట్లో కృత్రిమ కొరతను అడ్డుకుంటే తప్ప ధరలు దిగిరావు.