12-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 12: జగన్ పాలనలో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెట్టి, రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బృహత్తర బాధ్యత ఇప్పుడు చంద్రబాబుపై ఉంది. ఐదేళ్లపాటు ఆయన అలుపెరగకుండా శ్రమించినా... జగన్ వచ్చి ఒక్క ఛాన్స్ అనడంతో ప్రజలు ఆయనను నమ్మారు. చంద్రబాబు కంటే బాగా అభివృద్ధి చేస్తారేమోననుకుని 2019లో ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఐదేళ్ల విధ్వంసకర పాలన చూశాక.... చంద్రబాబు విలువేంటో, ఆయన అవసరమేంటో గుర్తించారు. రాష్ట్ర విభజన కంటే ఐదేళ్ల జగన్ విధ్వంసక పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందని తెలుసుకున్నారు. ఈసారి అసాధారణ సంఖ్యలో సీట్లు కట్టబెట్టి, కనీవినీ ఎరుగని మెజారిటీలతో కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబుకు మరోసారి పట్టం కట్టారు. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు చేతుల్లోనే ఉంది..!
రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బృహత్తర బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉంది. జగన్ పాలనలో అన్ని వ్యవస్థలూ విధ్వంసమయ్యాక... ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యాక... వచ్చే ఐదేళ్లూ రాష్ట్రాన్ని పరిపాలించడం నల్లేరు విూద బండి నడక కానేకాదు. దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెట్టడం, తీవ్ర నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన యువతకు మళ్లీ భరోసా ఇచ్చి, ఉపాధి కల్పనకు బాటలు వేయడం, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తిచేయడం, పెట్టుబడిదారుల్లో మళ్లీ విశ్వాసాన్ని పాదుకొల్పి పరిశ్రమల్ని తేవడం అంత ఆషామాషీ కాదు..!