13-06-2024
ఆంధ్రప్రదేశ్
తిరుమల, జూన్ 13: టిటిడి నుంచే పాలనా ప్రక్షాళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శ్రీవారి సమక్షంలో చెబుతున్నా.. నేను 5కోట్ల ప్రజల మనిషిని. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ 5 ఏళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారని అన్నారు. రాష్ట్రంలో ఇకపై పరదాలు, నియంత్రణ వుండదు. నేటి నుంచి ప్రజా పాలన ప్రారంభం అయ్యింది. గత 5ఏళ్లలో జరిగిన నష్టం అపారం. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. 2047 నాటి భారత్ ప్రపంచంలోనే మొదటి రెండు స్థానాల్లోకి వస్తుంది. 2047 విజన్‌తో ముందుకు వెళ్తానిని ప్రకటించారు. ఏపీ దేశంలోనే నెంబర్ 1న రాష్ట్రంగా ఉండాలి. తెలంగాణ అభివృద్ధి చెందాలి. తెలుగు రాష్ట్రాలకు పెద్దగా రెంటికీ మంచి జరిగేలా చూస్తానని అన్నారు.
గురువారం ఉదయం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశుని దర్శనం అనంతరం విూడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీవారి ఆశీస్సుల కారణంగానే తమ కూటమి విజయం సాధించిందన్నారు. రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారని.. 93 శాతం స్టైక్ర్ రేట్ గతంలో ఎప్పుడూ రాలేదన్నారు.తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు.. కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారన్నారు. తాను ఏ కార్యం చెయ్యాలన్నా ముందుగా తన కుల దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందుతానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 2003లో స్వామి వారికి వస్త్రాలు సమర్పించేందుకు వచ్చే సమయంలో నాపై క్లైమోర్ మైన్‌లతో దాడి చేశారు. ఆ దాడిని చూస్తే ఎవరు బ్రతకరు. కానీ శ్రీవారి ఆశీస్సులతో బయటపడ్డాను.
దేవాన్ష్ పుట్టినరోజు నాడు శ్రీవారి అన్నదానానికి ప్రతి ఏటా విరాళం ఇస్తున్నాం. నేను ప్రతి రోజు గంటల తరబడి పూజలను చెయ్యను. ఒక్క నిమిషం మాత్రమే ధ్యానం చేస్తాను. శ్రీవారిని ఒక్కటే కోరుకుంటా. రాష్ట్ర ప్రజలు బాగుండాలి. దేశం అభివృద్ధి చెందాలి. సంపదను సృష్టించి పేద ప్రజలకు పంచే అవకాశం ఇవ్వాలని కోరుకుంటానని అన్నారు. హైదరాబాద్‌ని 1.0 విజన్‌తో అభివృద్ధి చేశాను. అప్పుడు చేసిన అభివృద్ధిని చూసి ప్రపంచంలోని దేశాధినేతలు హైదరాబాద్‌కి వచ్చారు. భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం. నేను జైలులో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నది కుటుంబ వ్యవస్థనే. తిరువళ్ళ శనివారాల్లో ఉపవాసం వుండి స్వామి వారికీ పూజలు చేస్తాం. స్వామి వారి దర్శనానికి వచ్చే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారు. మన రాష్ట్రం, దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించే విధంగా ముందుకు వెళ్తాం.’ అని చంద్రబాబు చెప్పారు.
పేదరికంలేని సమాజాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తా. ఆర్థిక అసమానతలు లేని విదంగా చర్యలు చేపడుతాం. టీటీడీతోనే ప్రక్షాళన ప్రారంభం అవ్వాలి. నా పర్యటనలోనూ పరదాలు కడుతున్నారు. టీటీడీలో పెద్ద ఎత్తున్న అవకతవకలు జరిగాయి. జనాలనూ నా దగ్గరకు రానివ్వకుండా కర్ఫ్యు వాతావరణం సృష్టించారు. నా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. 30 ఏళ్ల క్రితమే వాళ్ళకి వ్యాపారం పెట్టించా. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలని పిలుపునిచ్చా.. నా పిలుపు మేరకు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. దురదృష్టం వల్ల అమరావతి, పోలవరం పడకేసింది. ఈ రెండిరటిని అభివృద్ధి చెయ్యాలి. తిరుమల ఒక పవిత్రమైన దివ్య క్షేత్రం. తిరుమలని అపవిత్రం చెయ్యడం భావ్యం కాదు. వైకుంఠం ద్వారా స్వామి వారిని దర్శించుకోవడం మంచి అనుభూతిని ఇస్తుంది.
తిరుమలని ప్రక్షాళన చేస్తా. దేశం గర్వపడేలా ప్రక్షాళన జరుగుతుందన్నారు. తిరుమలని దరిద్రపు ప్రాంతంగా తయారు చేశారు. గత ఐదేళ్లలో తిరుమలలో వీరు చెయ్యని అరాచకం లేదు. తిరుమల కొండపై అపచారం చేసిన వాళ్ళు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారు. మంచిని ప్రోత్సహిస్తా.. రౌడీయిజాన్ని అణచి వేస్తా’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో తిరుమలలో అటవీ ప్రాంతాన్ని అభివృద్ది చేయడంతో పాటు, ఔషధ మొక్కలను పెంచి అభివృద్ధి చేశామని అన్నారు. తిరుమలకు వస్తే ఆరోగ్యం పెరగాలి అన్నదే తన సంకల్పం అన్నారు.