13-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 13: ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇక పాలనపై సిఎం రేవంత్ దృష్టి సారించారు. ఇచ్చిన హావిూల అమలు, కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారు. ఒక్కో కార్యక్రమాన్ని పట్టాలకు ఎక్కించడం ద్వారా తెలంగాణలో ఆదర్శ పాలనకు తెరతీసే ప్రయత్నంలో ఉన్నారు. గత పదేళ్లో విధ్వంసం అయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేపట్టారు. విద్య,వైద్య రంగాలను ఆదర్శంగా తీర్చిదిద్దే సంకల్పంతో కార్యాచరణకు సిద్దం అవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పెద్దలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం అవుతోంది. పెరుగుతున్న జీవనశైలి వ్యాధులను అరికట్టేలా పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడిరచారు. ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణ కోసం 10 మొబైల్ ల్యాబ్స్ సిద్ధం చేసినట్లు చెప్పారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టనుండగా.. కేంద్రం నుంచి 60 శాతం నిధులు సమకూరనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూర్చనుంది. గ్రావిూణ స్థాయి నుంచి ప్రజలకు ముందస్తు పరీక్షలు నిర్వహించడం ద్వారా సకాలంలో చికిత్స అందించే వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అధ్యయనాల ప్రకారం తెలంగాణలో గత 20 ఏళ్లలో హృద్రోగాలు, క్యాన్సర్, మధుమేహం, బీపీ వంటి జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నట్లు తేలింది. దాదాపు 60 శాతం వ్యాధులు ధూమపానం, మద్యపానం, జంక్ ఫుడ్స్ వల్లే వస్తున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే, రొమ్ము క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధుల విషయంలో ఒక శాతంలోపే మహిళలు ముందస్తు పరీక్షలు చేయించు కుంటున్నారని లెక్కలు చెబుతున్నాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది వంద శాతం వరకూ ఉంటోంది. ప్రజలందరికీ ముందస్తు పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆయా వ్యాధులను నిర్దారించి సకాలంలో వైద్య చికిత్సలు అందించడానికి వీలు కలుగుతుందని ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు.
ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. గ్రావిూణ, పట్టణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ఊరూరా తిరుగుతూ 26-70 ఏళ్ల వయసున్న అందరికీ డిజిటల్ మయోగ్రామ్, పాప్‌స్మైర్, ఈసీజీ, ఈ2డీ ఏకో సహా ఇతర అన్ని బ్లడ్ టెస్టులు నిర్వహిస్తారు. దీనికి అనుగుణంగా ఏర్పాటు చేసిన మొబైల్ ల్యాబ్స్‌లో వైద్యులతో పాటు నర్సులు, ఇతర టెక్నీషియన్లు అందుబాటులో ఉంటారు. ప్రధానంగా మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార, నోటి క్యాన్సర్లు, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. పురుషుల్లో నోటి క్యాన్సర్‌తో పాటు షుగర్, బీపీ, గుండె వ్యాధులపై పరీక్షలు నిర్వహించి అవసరాన్ని బట్టి హైదరాబాద్ ఎంఎన్‌జే ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రికి తరలిస్తారు.
అక్కడ బయాప్సీ వంటి తదుపరి పరీక్షలతో వ్యాధి ఉందో లేదో నిర్దారిస్తారు. ఒకవేళ షుగర్, బీపీ వంటి సమస్యలుంటే బాధితులకు ఉచితంగా మందులు అందిస్తారు. వారి వారి గ్రామాలకు సవిూపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వారిని అనుసంధానం చేసి అక్కడి నుంచి ప్రతి నెలా మెడిసిన్స్ తీసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. ఒకవేళ బాధితులు ఎవరైనా ఆస్పత్రికి రాలేని స్థితిలో ఉంటే వారి ఇళ్ల వద్దకే ఆరోగ్య సిబ్బంది మందులు సరఫరా చేసేలా చూస్తారు.