13-06-2024 RJ
తెలంగాణ
మహబూబ్‌నగర్, జూన్ 13: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టారు. తమకు పదవు కోసం అందుబాటులో ఉన్న నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో 19 వ్యవసాయ మార్కెట్‌లు ఉండగా షాద్‌నగర్, ఆమనగల్లు, కొడంగల్ పట్టణాలు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోకి వెళ్లాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16 మార్కెట్‌లు పనిచేస్తున్నాయి. మహబూబ్‌నగర్, బాదేపల్లి, నాగర్ కర్నూల్, గద్వాల, మధనాపురం, మక్తల్, అలంపూర్, వనపర్తి, కల్వకుర్తి, అచ్చంపేట, నారాయణపేట, దేవరకద్ర, కొల్లాపూర్, కోస్గీ, ఆత్మకూర్, మార్కెట్ కమిటీలు కొనసాగుతున్నాయి. మార్కెట్ కమిటీ నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో గత ప్రభుత్వం మొదటిసారి రిజర్వేషన్ల వ్యవస్థను తీసుకువచ్చింది.
అందుకు అనుగుణంగా నాయకులు పైరవీలు మొదలు పెట్టారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలకు పాలక మండళ్ల ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఛైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ సభ్యుల పోస్టుల కోసం హస్తం పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే గద్వాల్‌లోని జోగుళాంబ అమ్మవారి ఆలయంతో పాటు ఇతర ముఖ్యమైన ఆలయాల పాలక మండలి ఛైర్మన్ పదవుల కోసం పార్టీ ముఖ్య నేతల పైరవీల కోసం తిరుగుతున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు హావిూలు సైతం ఇచ్చారు. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని హస్తం క్యాడర్ భావిస్తోంది. దీంతో పదవుల కోసం నేతల చుట్టూ పోటాపోటీగా నాయకులు చక్కర్లు కొడుతున్నారు.