13-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జూన్ 13: కమెడియన్ నటుడు పృథ్విరాజ్‌కు విజయవాడ ఫామిలీ కోర్టు షాకు ఇచ్చింది. 30 ఇయర్స్ ఇండస్టీ ఫేమ్ నటుడు పృథ్విరాజ్, తన భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెలా భరణం చెల్లించాలని విజయవాడ ఫామిలీ కోర్టు గతంలో ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను పృథ్విరాజ్ పక్కన పెట్టడమే కాకుండా, కోర్టుకు హాజరు కానందున, పృథ్విరాజ్ అరెస్టుకు కోర్ట్ వారెంట్ జారీ చేసినట్టుగా తెలిసింది. ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ అని కూడా తెలిసింది. విజయవాడకి చెందిన శ్రీలక్ష్మి నటుడు పృద్విరాజుని 1984లో వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఒక కుమారుడు, కుమార్తె వున్నారు. వీరి మధ్య మనస్పర్థలు రావటంతో పృథ్విరాజ్ భార్యతో కాకుండా విడిగా వున్నాడు. శ్రీలక్ష్మి తన ఇద్దరి పిల్లలను తీసుకొని పుట్టింట్లో వున్నారు. 2017లో శ్రీలక్ష్మి కోర్టుకు వెళ్లి, న్యాయపరంగా తనకి తన భర్త పృథ్విరాజ్ నెలకి రూ.8 లక్షల రూపాయలు భరణం చెల్లించాలని కోర్టువారిని కోరింది.
అందుకు కోర్టు కూడా అంగీకరించింది, అలాగే శ్రీలక్ష్మి న్యాయపోరాటానికి అయ్యే ఖర్చులు కూడా పృథ్విరాజ్ భరించాలని కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. పృథ్విరాజ్ సినిమాల్లోకి వెళ్ళాక తనని బాగా వేధించేవాడని, అందుకని తాను 2016 ఏప్రిల్ నెలలో తన పుట్టింటికి వచ్చేశానని అప్పట్లో శ్రీలక్ష్మి కోర్టుకు చెప్పారు. అలాగే తన భర్త సినిమాల ద్వారా, టీవిలో నటించడం ద్వారా నెలకి సుమారు రూ. 30 లక్షల వరకు సంపాదిస్తున్నాడని, అతని నుంచి తనకి భరణం ఇప్పించాలని 2017, జనవరిలో కోర్టులో కేసు ఫైల్ చేసింది శ్రీలక్ష్మి. కోర్టు వాదనలు వినిన తరువాత పృథ్విరాజ్ కి రూ. 8 లక్షలు ప్రతి నెలా 10వ తేదీలోగా ఆమెకి భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అయితే ఇప్పుడు పృథ్విరాజ్ ఈ భరణం చెల్లించడం లేదని, అదీ కాకుండా కోర్టుకు కూడా హాజరు కానందున అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది.