13-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 13: ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటిబ్లాక్‌లోని తన ఛాంబర్‌లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధశాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హావిూ మేరకు.. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు ్గªల్‌పై రెండో సంతకం, సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు దస్త్రంపై మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగు, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు సిఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వెళ్తున్న సీఎం చంద్రబాబుకు అమరావతి రైతులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా పూలు చల్లి మహిళలు హారతులు పట్టారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంలో భారీ పూలదండలతో ఆయనకు స్వాగతం పలికారు. వారిని చూసిన చంద్రబాబు తన కాన్వాయ్ నుంచి దిగి రైతులకు అభివాదం చేశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. సీఎం చంద్రబాబు ప్రయాణించే రోడ్డుమార్గం మొత్తం అమరావతి రైతులు పూలతో నింపేశారు. సీడ్ యాక్సెస్, మందడం, వెలగపూడి రోడ్ల విూదుగా సచివాలయం వరకు రకరకాల పూలతో రహదారులు నిండిపోయాయి. ఐదేళ్ల తర్వాత అమరావతి అభివృద్ధికి అడుగులు పడనుండడంతో చిన్న, పెద్ద, కులం, మతం తేడా లేకుండా స్వాగతం పలికారు.
పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొనడంతో మందడంలో భారీ జన సందోహం నెలకొంది. పెద్దఎత్తున బాణసంచా కాలుస్తూ చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకొని ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎంకు దేవాదాయ శాఖ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఆలయ ఈవో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.