14-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 14: తెలంగాణలో 700 కోట్ల గొర్రెల పంపిణీ స్కామ్ వ్యవహారం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఈడి రంగంలోకి దిగుతుందన్న వార్తల నేపథ్యంలో గత కెసిఆర్ పాలన ఎంత అధ్వాన్నంగా, అక్రమంగా, అవినీతిమయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మసిపూసి మారేడుకాయ చేసి, తెలంగాణ ధనిక రాష్ట్రం అంటూ ప్రగల్భాలు పలికిన కెసిఆర్, ఆయన అనుచరగణం అవినీతి వ్యవహారాలపై కుక్కిన పేనుల్లా ఉన్నారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, గొర్రెల పంపిణీ ఇలా అనేక పథకాలన్నీ అవినీతికి ఆలవాలంగా ఉన్నాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటివే రేపు ఎపిలోనూ బయట పడతాయి. రాష్ట్రాలను అప్పులపాలు చేయడంలో కెసిఆర్, జగన్ పోటీపడ్డారు. అవినీతిలోనూ పోటీ పడ్డారు. ఈ రాష్ట్రం ఏమైతే నాకేందన్న ధోరణిలో కెసిఆర్, జగన్ వ్యవహరించిన తీరు క్షంతవ్యం కాదు.
ఇలాంటి అవినీతిపరులను ఊచలు లెక్కపెట్టేలా చేయాల్సిందే. ప్రాంతీయ పార్టీల నేతల అవినీతి కారణంగానే రాష్టాల్రు అభివృద్ది చెందడం లేదు. మోడీ నియంతృత్వ పాలన అంటూ విమర్శలు చేస్తున్న నేతలు ఎవరు కూడా మోడీ ముందు నిలబడి గట్టిగా నిలదీయలేకపోతున్నారు. సమస్యలపై పోరాడలేక పోతున్నారు. ఉమ్మడిగా పోరాడాలన్న సంకల్పం ఎలాగూ లేదు..కనీసం ఉమ్మడి కార్యాచరణకు కూడా విపక్షాలు కలసి రాలేక పోతున్నాయి. ప్రాంతీయ పార్టీల నేతలు తమ రాష్ట్రాల్లో అనేక అవినీతి, అక్రమాల్లో కూరుకుని పోయారు. పాలన చేపట్టిన ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల అధినేతలు అవినీతి ఊబిలో కూరుకుపోయారు. ఇదే అదనుగా మోడీ ద్వయం ఈ పార్టీల ను చెడుగుడు ఆడేస్తుస్తున్నది. అందుకే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ మోడీని నేతగా ప్రజలు గుర్తించారు.
ప్రత్యమ్నాయం లేదన్న భావనలో ప్రజలు ఉన్నారు. అవినీతిలో కూరుకుపోని రాష్ట్రం లేదు.అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి వచ్చి ఆప్ నేతలు కూడా అవినీతిలో కూరుకు పోయారు. అరవింద్ కేజ్రీవాల్ సైతం లిక్కర్ స్కామ్‌లో ఇరుకున్నారు. ఇక కెసిఆర్ కూతురు కవిత గురించి చెప్పాల్సిన పనిలేదు. బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీ నేతలపైనా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీరంతా కలిసి కాంగ్రెస్‌తో జతకట్టి ఇండియా కూటమిగా వచ్చినా ప్రజలను అంతగా ప్రభావితం చేయలేక పోయారు. ఈ కారణంగానే ప్రాంతీయ పార్టీల నేతలు కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేక పోతున్నారు. కేవలం వారున్నచోటనే కూర్చుని విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో కెసిఆర్ విమర్శలు లేదా ఆరోపణలు తెలంగాణ దాటి రాలేకపోతున్నాయి. ఎపిలో జగన్ అవినీతి అక్రమాలతో విసుగెత్తిన జనం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు.
ఒకప్పుడు జాతీయ పార్టీలకు సవాలుగా నిలిచిన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ప్రాంతీయ అస్తిత్వం కాపాడు కునే ప్రయత్నంలో ఉన్నాయి. నాయకులలో అధికార కాంక్ష పెరిగిపోవడం కారణంగా సొంత రాష్ట్రం వదిలి రావడం లేదు. అవినీతి కోసం నానా గడ్డీ కరుస్తున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తరవాత ప్రతిపక్ష రాజకీయాలకు ఉమ్మడి ఎపి కేంద్ర బిందువుగా ఉండేది. ఆనాటి కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ విధానాలపై తెలుగుదేశం అలుపెరగని పోరాటం చేసింది. ఎన్టీ రామారావు తరవాత చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. అదే చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీలో మళ్లీ కొంత కీలకంగా మారారు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని ప్రారంభించిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ప్రకటించినా.. ఆయన తెలంగాణ దాటి రాజకీయాలు చేయలేకపోయారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఇక పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. దీనికితోడు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నా.. జాతీయ రాజకీయాలపై ఎప్పుడూ ఆసక్తి చూపలేదు. రాష్ట్రంలో అవినీతి కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కారణంగా ఘోరంగా ఓడిపోక తప్పలేదు. అలాగే తనకున్న అవినీతి అక్రమ కేసుల బలహీనతల కారణంగా బిజెపిని ఏనాడూ ఎదరించే సాహసం చేయలేదు. మరో ప్రాంతీయ పార్టీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చినా.. ఇప్పుడు ఎన్‌డిఎలో ఉండడంతో మోడీకి వ్యతిరేకంగా నిలదీసే ధైర్యం చేయలేడు. మళ్లీ అధికారం దక్కించుకోవడంతో ఎపిని గట్టెక్కించేందుకు నానా తంటాలు పడకతప్పదు. తమకున్న పరిధి రీత్యా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని జగన్ లేదా కెసిఆర్ ఎదిరించలేని పరిస్థితిలో ఉన్నారు. నైతికంగా బలహీన పడటం వల్లనే కేంద్ర అధికారానికి దాసోహం అనాల్సిన పరిస్థితి ఏర్పడిరది. నిన్న మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వంపై కాలు దువ్విన కేసీఆర్, కవిత లిక్కర్ స్కామ్ తరవాత పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది.
జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేస్తానంటూ వివిధ రాష్ట్రాలలో పర్యటించి, హడావిడి చేసిన కెసిఆర్ సార్వత్రిక ఎన్నికల ముందు చతికిల పడ్డారు. దీంతో ఆయనను ఎవరు కూడా నమ్మలేని స్థితికి వచ్చారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పీకల్లోతు ఇరుక్కున్నాక.. ఇప్పుడు బయటపడుతున్న అవినీతి వ్యవహారాల తో కెసిఆర్ రాజకీయంగా సమాధి అయినట్లే. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో బిజెపిని ఎదురించడానికి సాహసించే నాయకులు కానరావడం లేదు. చంద్రబాబు అయితే కేవలం ఇప్పుడు ఎపికి పరిమితం అయ్యారు. ఇక మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్‌లు సైతం మోడీని ఎదిరించలేక చతికిల పడ్డారు. ఇలా ఒక్కో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల నేతలు అవినీతిలో కూరుకు పోవడమే దీనికి కారణం. వీరంతా కలిసినా ప్రత్యమ్నాయం సృష్టించలేరని ప్రజలకు కూడా తెలిసిపోయింది. అందుకే మోడీకి ప్రత్యామ్నాయ నేత లేన్న భావనలో ప్రజలు కూడా ఉన్నారు.
కాంగ్రెస్‌లో కూడా కుటుంబ రాజకీయాలు మరింత జోరుగా చర్చకు వస్తున్నాయి. ప్రియాంక కూడా రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్దం అంటోంది. అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే నామమాత్రంగా ఉన్నారు. మొత్తంగా ప్రాంతీయ పార్టీల అవినీతి కారణంగా దేశం కూడా కుంటుపడుతోంది. ఇలాంటి అవినీతి నేతలను బోనులో నిలబెట్టేలా సత్వర చర్యలకు వీలు కలిగించే చట్టాలు రావాలి. లోక్‌పాల్ డిమాండ్ సాకారం కావాలి. అవినీతి కేసుల్లో ఏడాదిలోపే దర్యాప్తు పూర్తి చేయించి, శిక్షలు పడేలా చేస్తేనే మంచిది.