14-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 14: ఏటా జరిగే ఆషాఢ బోనాలు జూలై 7న ప్రారంభం కానున్నాయి. గోల్కొండ బోనాలతో బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రతీ సంవత్సరం ఆషాఢ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం గోల్కొండ కోటపై గల శ్రీ ఎల్లమ్మ(జగదాంబిక) ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈసారి ఆషాఢంలో అమావాస్య జూలై 5న వస్తుంది. తరువాత వచ్చే ఆదివారం జూలై 7 నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ మొదటి పూజ జరిగిన తర్వాత తెలంగాణలోని ఇతర ఆలయాల్లో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. గోల్కొండ తర్వాతనే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్‌దర్వాజ మహంకాళి ఆలయంలో పూజలు జరుగుతాయి. ఆషాఢమాసంలో చివరి రోజు గోల్కొండ కోటలోనే చివరి బోనం పూజ జరుగుతుంది. దీంతో బోనాల ఉత్సవాలు సమాప్తం అవుతాయి.
గోల్కొండ కోటపై గల శ్రీఎల్లమ్మ(జగదాంబిక) ఆలయంలో జూలై 7నుంచి నెల రోజుల వరకు ప్రతీ గురువారం, ఆదివారం బోనాలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇక్కడ తొమ్మిది ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలకు నగరం నలు మూలల నుంచే గాక, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు. గోల్కొండ బోనాల ట్రస్ట్‌బోర్డు కమిటీ పదవీకాలం ముగియడంతో దేవాదాయ శాఖ అధికారులు నూతన కమిటీ ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలవుతుందని వారు తెలిపారు. ట్రస్ట్‌బోర్డు అధ్యక్ష పదవికి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే చాలామంది రాష్ట్ర మంత్రులను కలుస్తూ తనకు అవకాశం కల్పించాలని కోరారు.