14-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 14: బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణం జూలై 9న వైభవంగా జరుగనుంది. ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. జూలై 8న ఒగ్గు కళాకారులతో పుట్టమన్ను తెప్పించడంతో పాటు ఎస్‌ఆర్‌నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఎదుర్కోళ్లు, (శాక్తేయముగా) నిర్వహిస్తూ ఎల్లమ్మ దేవాస్థానం వరకు ఊరేగింపుగా రావడంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 9న ఆలయానికి తూర్పు ముఖంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో అమ్మవారి కల్యాణం నిర్వహిస్తారు. 10వ తేది 6 గంటలకు కల్యాణం వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులతో రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి. గత సంవత్సరం నిర్వహించిన కల్యాణానికి భక్తులకు ఎలాంటీ అసౌకర్యాం కలుగకుండా మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నెల రోజుల ముందుగానే వివిధ శాఖల అధికారులతో సవిూక్ష సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించేవారు.
ఈ సారి మాత్రం కల్యాణ సమయం దగ్గర పడుతున్నా ఏర్పాట్లు, ఆలయ సుందరీకరణపై ఆలయ చైర్మన్, అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈవో నాగరాజు లాంగ్ లీవ్‌లో ఉండడం ఇన్‌చార్చి ఈవోగా బాధ్యతలు తీసుకున్న జ్యువెల్లరీ ఇన్‌స్పెక్షన్ అధికారి(జేవివో) అంజలి దేవి ఏర్పాట్లపై దృష్టి సారించాలని కోరుతున్నారు. గత సంవత్సరం అమ్మవారి కల్యాణం వీక్షించేందుకు అంచనాలకు మించి భక్తులు 10 లక్షల మంది విచ్చేశారు. ఈ సారి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయనున్న నేపథ్యంలో సౌకర్యాలపై అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.