14-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
రాజమహేంద్రవరం, జూన్ 14: ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ సాయాన్ని రూ.3వేల నుంచి రూ.4వేలకు సీఎం చంద్రబాబు పెంచారని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సంక్షేమంపైనే కాకుండా అభివృద్ధి పైనా తమ ప్రభుత్వం దృష్టి పెడుతోందని చెప్పారు. అన్న క్యాంటీన్లను కూడా తెరిపిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పులు చేసిన అధికారులను విడిచిపెట్టబోమని, చట్టప్రకారం చర్యలుంటాయని బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో అధికారులు కనీసం ప్రొటోకాల్ పాటించలేదు.. ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వలేదన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన భూ అక్రమాలపై విచారణ చేయిస్తామని తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన రాజమండ్రిలో విూడియాతో మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ ఆంధప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశారని, నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి చర్యలతో తెలుగు జాతి తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పుడు రాష్ట్రాన్ని బాగుచేయాల్సిన అవసరం ఉందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. ఆ బాధ్యత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నారని అన్నారు.
సీఎంగా బాధ్యతలు తీసుకుంటూనే చంద్రబాబు పనులు ప్రారభించారని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హావిూల మేరకు పలు కీలక ఫైల్ పై సంతకాలు చేశారని, భారీగా ఉద్యోగాల భర్తీకి పనులు ప్రారంభించారని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. 40ఏళ్ల తన అనుభవానికి మంత్రి పదవి వస్తుందని ఆశించానని.. అయినా మంత్రి పదవి రాలేదని తనకు అసంతృప్తి లేదని బుచ్చయ్యచౌదరి అన్నారు. సీఎం చంద్రబాబు మాటతప్పలేదు.. మడమ తిప్పలేదని.. తొలి సంతకంతోనే ఎన్నికల హావిూలు నెరవేర్చారని, జగన్ సహా దోపిడీ చేసిన అధికారులను శిక్షించాలని బుచ్చయ్య చౌదరి కోరారు.