14-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 14: ఎపి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయ్యిందని, ఆస్తులు, అప్పులు చూసి ముందుకు వెళ్లాల్సిన అసవరం ఉందని ఆర్థికమంత్రి పయ్యవావులు కేశవ్ అన్నారు. ఇందుకోసం అధినేత చంద్రబాబుతో కలసి నడుస్తానని అన్నారు. ఇకపోతే రాష్ట్ర ఖజానా ఎంత ఉందో తాము ఇంకా చూడాల్సి ఉందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో నిధుల మళ్లింపు, భవిష్యత్ ఆదాయం తాకట్టు వంటి అనేక అవకతవకలు జరిగాయని పయ్యావుల కేశవ్ అన్నారు. కాగ్ కూడా ఈ మేరకు నివేదిక ఇచ్చిందని, సంక్షేమానికి సమపాళ్లలో ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు. సంపద సృష్టి పేరుతో పన్నులు వేసేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు బ్రాండ్‌తో పరిశ్రమలు, ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకువస్తామని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఇకపోతే ఏపీలో తప్పనిసరిగా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నట్టు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
ఎందుకంటే వైఎస్సార్సీపీ అధినేత జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడాలని తాను కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. శాసనసభకు జగన్ రావాలని కోరుకుంటున్నానని, గతంలో చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న దివంగత నేత పీజేఆర్‌ను ఇంటికి వెళ్లి కలిశారని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండాలని ఆవశ్యకత ఉందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఒత్తిడిలో ఉన్నప్పుడే ఆయనలో నిజమైన స్ఫూర్తి బయటకు వస్తుందని కేశవ్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షం మొత్తాన్ని సస్పెండ్ చేసి చంద్రబాబు ఒక్కరినే అసెంబ్లీలో ఉంచారని ఆయన గుర్తుచేశారు. అప్పుడే చంద్రబాబులో ఉన్న ఫైటింగ్ స్పిరిట్ బయటకు వచ్చిందని చెప్పుకొచ్చారు.