14-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 14: యువతను మత్తులో పెట్టి, గంజాయికి బానిసలుగా వైసీపీ నేతలు మార్చారని ఎక్సైజ్, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అడ్డమైన బ్రాండ్లతో జగన్ అడ్డంగా సంపాదించాడని అన్నారు. ఏపీలో నూతన మద్యం పాలసీతో నాసిరకం మద్యం లేకుండా చేస్తామని అన్నారు. గంజాయి రవాణా పూర్తిగా అరికట్టే చర్యలు త్వరలో చేపడతామని అన్నారు. తన విూద నమ్మకం ఉంచి రెండు కీలక శాఖలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొల్లు కృతజ్ఞతలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం, ఇసుక మాఫియా దోచుకున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార వ్యవస్థలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. డిస్టిలరీలు,మద్యం కంపెనీలు మొత్తం వైసీపీ నేతలకే ఇచ్చారని చెప్పారు.
నాసిరకం మద్యంతో పేదల జీవితాలతో వైసీపీ నేతలు అడుకున్నారని ధ్వజమెత్తారు. గంజాయిని కూడా విచ్చల విడిగా రవాణా చేయించారని విమర్శించారు. ఇసుక నిలిపివేసి నిర్మాణ రంగాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. లక్షల మంది కార్మికులు పొట్ట కొట్టారని ఫైర్ అయ్యారు. ఇసుక దోపిడీతో కోట్లు దోచుకుని ప్రజలకు కన్నీళ్లు మిగిల్చారని విమర్శించారు. వారి అవినీతి, అక్రమాలు, సహకరించిన అధికారులపై విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసీ ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు సారథ్యంలో సుపారిపాలనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.