14-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 14: గత భారాస ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు భూసమస్యలను ఎదుర్కొంటున్నారని, ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికే ధరణి పోర్టల్‌ను పునర్‌వ్యవస్థీకరించి, భూ వ్యవహరాలకు సంబంధించిన చట్టాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఏర్పడిరదన్నారు. ఆ దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టామని తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ధరణి కమిటీ సభ్యులతో మంత్రి పొంగులేటి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ’గత ప్రభుత్వం హడావుడిగా ఎలాంటి అధ్యయనం చేయకుండా ఈ పోర్టల్‌ను తీసుకొచ్చింది.
దీంతో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. వాటిని పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు ధరణిని ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నాం. ఈ పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేశాం. ఈ కమిటీ ఇచ్చిన సిఫారసులపై సమావేశంలో చర్చించాం. కమిటీ తుది నివేదిక ప్రభుత్వానికి ఇచ్చే ముందే అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తాం అని తెలిపారు. ఈ కమిటీ రాష్ట్రంలో భూసంబంధిత నిపుణులు, అధికారులతో చర్చించడంతోపాటు 18 రాష్ట్రాల్లోని ఆర్‌వోఆర్ యాక్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలించిందని మంత్రి తెలిపారు.
భూ వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ ట్రైబ్యునల్‌లను ఏర్పాటు చేయాలని, భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలను కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని కమిటీ సూచించినట్లు చెప్పారు. ధరణి పోర్టల్‌ను బలోపేతం చేయడంతోపాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా, అందరికీ సులువుగా అర్థమయ్యే విధంగా మార్పులు చేపట్టబోతున్నట్లు వెల్లడిరచారు. గత ప్రభుత్వం పార్ట్-బిలో ఉంచిన భూ సమస్యలను పరిష్కరించానికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు.