15-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్15: సాధారణంగా దొంగలు.. ఎవరూ లేని ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఇళ్లల్లోకి చొరబడి.. నగదు, బంగారం వంటి విలువైన వస్తువులు ఎత్తుకెళ్తారు. కానీ, ఓ దొంగ మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. దొంగతనాలు చేసేందుకు విమానాలనే అడ్డగా మార్చుకున్నాడు. విమానాల్లో ప్రయాణిస్తూ దొంగతనాలు చేయడం మొదలెట్టాడు. ఒంటరి మహిళలే టార్గెట్ చేస్తూ.. చాలా ఈజీగా బంగారు ఆభరణాలు కొట్టేస్తున్నాడు. సరదాగా సాగిపోతున్న తన దొంగతనాలకు ఎట్టకేలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు చెక్ పెట్టారు. విమానాల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను ఆర్ జీఐ ఎయిర్ పోర్ట్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..అతరి దగ్గర నుంచి సుమారు ఒక కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడిరచారు. ఈ సందర్భంగా డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ... ఢిల్లీకి చెందిన రాజేష్ సింగ్ కపూర్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి.. దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. 110 రోజుల్లో ఏకంగా 200 సార్లు విమానాల్లో తిరుగుతూ.. దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. కనెక్టివిటీ విమానాల్లో ప్రయాణించి ఒంటరి మహిళలే లక్ష్యంగా ఈ దొంగతలకు పాల్పడుతున్నాడని చెప్పారు.
విమానంలోని క్యాబిన్ లో భద్రపరిచిన ఒంటరి మహిళల బ్యాగుల పక్కనే నిందితుడు తన బ్యాగును పెట్టి.. వారు వాష్ రూమ్ కు వెళ్లిన వెంటనే అక్కడికి వెళ్లి సదరు మహిళల బ్యాగులో ఉండే విలువైన బంగారు ఆభరణాలను అతని బ్యాగులో పెట్టుకోవడం జరుగుతుందని చెప్పారు. తర్వాత విమానం దిగి బంగారు ఆభరణాలను పాన్ బ్రోకర్లకు అమ్మి డబ్బులు సంపాదిస్తున్నాడని తెలిపారు.ఆర్ జీ పోలీస్ స్టేషన్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిందితుడిపై పది కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. అతనికి సహకరిస్తున్న మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. విమానాల్లో ప్రయాణించే మహిళలు తమ వెంట తీసుకువెళ్లే బ్యాగులను జాగ్రత్తగా పెట్టుకోవాలని ప్రయాణికులకు సూచించారు.