15-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 15: ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటోలను ఏర్పాటు చేస్తుంటారు. కానీ రాష్ట్రంలో ఇకపై సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ చిత్రపటాలను కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇరువురు ఫొటోలను ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఐ అండ్ పిఆర్ అధికారులకు సూచనలు చేశారు. తాజా నిర్ణయంతో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉండనున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్‌కు బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. రాష్ట్రంలో వైసిపి ఓటమి సాధించడంలో, టిడిపి, జనసేన, బిజెపి నేతృత్వంలో కూటమి ఏర్పాటు కావడంలో పవన్ క్రియాశీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు కీలక శాఖలను పవన్ కు అప్పగించారు. పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన పదవికి గౌరవాన్ని కల్పించే ఉద్దేశంతో మరొకరికి ఉప ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు ఇవ్వలేదు. తనతో పాటు సమానంగా పవన్‌కు గౌరవాన్ని ఇవ్వాలని భావించిన చంద్రబాబు నాయుడు.. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ ఫోటో కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.